బెంగళూరు ట్రాఫిక్ కు విరుగుడు..! 10వేల కోట్ల ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే..!
సిలికాన్ వ్యాలీగా పేరు తెచ్చుకున్న కర్నాటక రాజధాని బెంగళూరు కొంతకాలంగా ట్రాఫిక్ ఇబ్బందులకు కేంద్రంగా మారిపోయింది. బెంగళూరు ట్రాఫిక్, రోడ్ల దుస్దితిపై కొంతకాలంగా జాతీయ స్ధాయిలో చర్చ జరుగుతోంది. ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా విఫలమవుతుండటంతో నగరవాసులకు చిర్రెత్తుకొస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కర్నాటక కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
బెంగళూరు ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించేందుకు వీలుగా 10 వేల కోట్ల ఖర్చుతో 117 కిలోమీటర్ల పొడవైన పెరిఫెరల్ రింగ్ రోడ్డు లేదా బిజినెస్ కారిడార్ గా పిలిచే ప్రత్యేక రోడ్డును నిర్మించేందుకు కర్నాటక కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. రెండేళ్లలో పూర్తవుతుందని భావిస్తున్న ఈ బెంగళూరు బిజినెస్ కారిడార్ వల్ల నగరంలో 40 శాతం ట్రాఫిక్ తగ్గిపోతుందని అంచనా వేస్తున్నారు. బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ దీని నిర్మాణం చేపట్టనుంది.

బెంగళూరు ట్రాఫిక్ తగ్గించేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామని, ఇందులో భాగంగా రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్లు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తెలిపారు. దీని వల్ల 1900 కుటుంబాలపై ప్రభావం పడుతుందన్నారు. అయితే వారు ఆశించిన దాని కంటే ఎక్కువ పరిహారం అందిస్తోందన్నారు. కర్నాటక ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఇది ఒకటని శివకుమార్ తెలిపారు. ఈ కారిడార్ అమల్లోకి వచ్చాక నగర ట్రాఫిక్‌లో 40 శాతం తగ్గుతుందన్నారు. హైవేలు, పారిశ్రామిక మండలాల మధ్య వెళ్లే వాహనాలు నగర కేంద్రాన్ని తప్పించి ఈ రింగ్ రోడ్డుపై వెళ్తాయన్నారు.

ఈ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు తొలుత 27 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినా దాన్ని ప్రభుత్వం 10 వేల కోట్లకు తగ్గించగలిగినట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అయితే ఇంకా కొంతమంది భూయజమానులు భూమి ఇచ్చేందుకు నిరాకరిస్తే తాము కోర్టులో పరిహారం మొత్తాన్ని జమ చేసి ముందుకెళ్తామని ఆయన తేల్చిచెప్పేశారు. ఏ భూమినీ ఎట్టి పరిస్థితుల్లోనూ డీ-నోటిఫై చేయరని ప్రకటించారు. ఎక్కువ మంది రైతులు నగదు చెల్లింపుల కంటే భూమి ఆధారిత పరిహారాన్ని ఎంచుకుంటున్నారని ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications