భోజ్‌శాలా ఆలయం హిందువులదే.. హైకోర్టు సంచలన ప్రకటన!
మధ్యప్రదేశ్ లోని ధార్ జిల్లాలో ఉన్న వివాదాస్పద భోజ్‌శాలా సముదాయంపై శుక్రవారం హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కట్టడం రాజా భోజుడు నిర్మించిన వాగ్దేవి(సరస్వతీ) ఆలయమేనని న్యాయస్థానం స్పష్టం చేసింది. గతంలో(2003లో) భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) చేసిన ఏర్పాటును కోర్టు కొట్టివేసింది. అప్పట్లో హిందువులు మంగళవారం పూజలు చేసుకోవడానికి, ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకోవడానికి అనుమతి ఉండేది. అయితే తాజాగా కోర్టు ఈ ఉమ్మడి ప్రార్థనల విధానాన్ని రద్దు చేస్తూ.. అక్కడ హిందూ ఆరాధనల కొనసాగింపును గుర్తించింది.
భారత పురావస్తు శాఖకు కోర్టు ఆదేశాలు
ఈ వివాదాస్పద స్థలం విషయంలో హైకోర్టు భారత పురావస్తు శాఖకు పలు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కట్టడం పరిరక్షణ, సంరక్షణ బాధ్యతలను పూర్తిగా భారత పురావస్తు శాఖ పర్యవేక్షణలోనే ఉంచాలని కోర్టు పేర్కొంది. పురాతన స్మారక చిహ్నాలు, పురావస్తు ప్రదేశాల చట్టం కింద దీనిని సంరక్షించాలని సూచించింది. లండన్ మ్యూజియంలో ఉన్న సరస్వతీ దేవి విగ్రహాన్ని తిరిగి తీసుకురావాలని హిందూ పక్షాలు కోరుతున్న నేపథ్యంలో, ఆ విగ్రహాన్ని రప్పించి భోజ్‌శాలాలో ప్రతిష్టించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని న్యాయస్థానం పేర్కొంది.

చారిత్రక ఆధారాలు
భోజ్‌శాలాను సరస్వతీ ఆలయంగా నిర్ధారించడానికి కోర్టు పలు చారిత్రక అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ధార్ ప్రాంతాన్ని సంస్కృత విద్యకు కేంద్రంగా మార్చిన పారామర వంశపు రాజు రాజా భోజుడితో ఈ కట్టడానికి ఉన్న అనుబంధాన్ని కోర్టు ప్రస్తావించింది. అక్కడ లభించిన శాసనాలు, పురావస్తు అవశేషాలు, వాస్తుశిల్ప రీతులను చారిత్రక ఆధారాలుగా స్వీకరించింది. సాహిత్య ఆధారాలు కూడా ఇక్కడ ఒకప్పుడు గొప్ప సంస్కృత పాఠశాల, సరస్వతీ ఆలయం ఉన్నట్లు ధ్రువీకరిస్తున్నాయని న్యాయమూర్తులు జస్టిస్ విజయ్ కుమార్ శుక్లా, జస్టిస్ అలోక్ అవస్థీలతో కూడిన ధర్మాసనం వెల్లడించింది.
మసీదు కోసం ప్రత్యామ్నాయ భూమి
హిందువుల హక్కులను గుర్తిస్తూనే, ముస్లిం వర్గాల మతపరమైన హక్కులను కాపాడేందుకు కోర్టు ఒక ప్రతిపాదన చేసింది. ముస్లిం పక్షాలు దరఖాస్తు చేసుకుంటే, ధార్ జిల్లాలోనే మసీదు నిర్మాణం కోసం తగిన ప్రత్యామ్నాయ భూమిని కేటాయించే విషయాన్ని పరిశీలించాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.ఈ తీర్పుపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ, ఇది బాబ్రీ మసీదు తీర్పును పోలి ఉందని, సుప్రీంకోర్టులో దీనికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications