ట్రంప్ ఏఐ వీడియోతో 200 మందికి టోపీ..! 2 కోట్లు దోచేశారు ఇలా..!
కృత్రిమ మేథ లేదా ఏఐ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎన్ని అద్భుతాలు చేస్తుందో చూస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఎన్ని అనర్థాలకు కారణమవుతుందో కూడా కనిపిస్తూనే ఉంది. ఇలాంటిదే ఓ ఘటన కర్నాటకలో చోటు చేసుకుంది. ఓ ఏఐ సాయంతో రూపొందించిన వీడియోను అడ్డుపెట్టుకుని ఏకంగా 200 మందిని సైబర్ నేరగాళ్లు దోచుకున్న ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. భవిష్యత్తులో జరిగే మోసాలకు ఓ ట్రయల్ గా జరిగిన ఈ మోసం జాతీయ స్దాయిలో చర్చనీయాంశమవుతోంది.
కర్నాటకలోని పలు నగరాల్లో కొన్ని నెలలుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై రూపొందించిన ఓ ఏఐ వీడియోను అడ్డుపెట్టుకుని సైబర్ నేరగాళ్లు వందల మందిని ముంచేశారు. భారీగా రాబడి ఆశ చూపించి ట్రంప్ హోటల్ అద్దెల్లో పెట్టుబడి పెట్టాల్సిందిగా అమాయకుల్ని బుట్టలో వేశారు. దీంతో బాధితులు సహజంగానే హోటళ్లు కలిగిన వ్యాపార వేత్త అయిన ట్రంప్
మొహం చూసి మోసపోయారు. ఇలా 2 కోట్ల వరకూ వారు పోగొట్టుకున్నారు.

కర్నాటక సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ సైబర్ నేరాల కేసులు ఎక్కువగా బెంగళూరు, తుమకూరు, మంగళూరు, హవేరిలలో నమోదయ్యాయి. హవేరిలో మాత్రమే 15 మందికి పైగా ఈ స్కామ్‌లో డబ్బు పోగొట్టుకున్నట్లు సమాచారం. బాధితులకు లాభదాయకమైన రాబడి, ఇంటి నుండి పని, పెట్టుబడి అవకాశాలను సైబర్ నేరగాళ్లు అందించినట్లు పోలీసులు వెల్లడించారు.
మొదట్లో వినియోగదారులను వారి ఖాతాలను సెటప్ చేయడానికి రూ.1,500 చెల్లించమని అడిగారని, ఆపై కంపెనీ ప్రొఫైల్‌లను రాయడం వంటి పనులను వారికి అప్పగించారని పోలీసులు తెలిపారు. పూర్తయిన ప్రతి పని యాప్ డాష్‌బోర్డ్‌లో వారి డబ్బులు పెరుగుతున్నట్లు చూపించినా వాస్తవంలో అలా జరగలేదన్నారు. హవేరి సైబర్ క్రైమ్ ఎకనామిక్స్ అండ్ నార్కోటిక్స్ పోలీసులు బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications