గుజరాత్ హైకోర్టు ఆదేశాలు పక్కనబెట్టేసిన సుప్రీంకోర్టు..!
గుజరాత్ లో 2002లో చోటు చేసుకున్న మతఘర్షణల తదనంతర పరిణామాల్లో సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ కు సుప్రీంకోర్టులో ఇవాళ భారీ ఊరట లభించింది. ఈమెకు గతంలో మధ్యంతర బెయిల్ ఇచ్చి ఆ తర్వాత లొంగిపోవాలంటూ గుజరాత్ హైకోర్టు జారీ చేసిన ఆదేశాల్ని సుప్రీంకోర్టు ఇవాళ రద్దు చేసింది. దీంతో ఇకపై ఆమెకు సాధారణ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాద్ ను ఈ నెల ప్రారంభంలో వెంటనే లొంగిపోవాలని గుజరాత్ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గతంలో ఆమెకు తాత్కాలికంగా గుజరాత్ హైకోర్టు ఆదేశాల నుంచి ఊరట కల్పించిన హైకోర్టు.. ఇవాళ రెగ్యులర్ బెయిల్ ఇవ్వడం ద్వారా పూర్తి ఊరట ఇచ్చింది.

గుజరాత్ అల్లర్లకు సంబంధించిన కేసుల్లో కల్పిత సాక్ష్యాలను తయారు చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు జరుగుతున్న సమయంలో రెగ్యులర్ బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న అభ్యర్ధనను గుజరాత్ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. అయితే ఈ ఆదేశాల్ని సుప్రీంకోర్టు లో జస్టిస్ బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్న, దీపాంకర్ దత్తా ధర్మాసనం కొట్టేసింది. తమ పరిశీలనలో సెతల్వాద్‌పై ఛార్జ్ షీట్ దాఖలు చేశారని, కాబట్టి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న కేసులో సాక్షులను ప్రభావితం చేయొద్దని సెతల్వాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్.. సెతల్వాద్ అరెస్టు ఉద్దేశ్యాలు, సమయాలను గుజరాత్ పోలీసుల్ని ప్రశ్నించారు. 2022 వరకు ఏం చేస్తున్నారని అడిగారు. జూన్ 24, జూన్ 25 నుండి ఏం దర్యాప్తు చేసారని ప్రశ్నించారు. ఆమె అరెస్టు చేసేంత దారుణమైన పని చేసిందని మీరు ఎలా నిర్ణయించుకున్నారని కూడా నిలదీశారు. అధికారుల వాదనలను ఆమోదిస్తే.. సాక్ష్యాధారాల నిర్వచన చట్టం మారిపోతుందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications