సద్గురు జగ్గీ వాసుదేవ్ కు భారీ ఊరట-ఆ ఇద్దరు మహిళలు అక్కడే ఉండొచ్చన్న సుప్రీం..!
ఇద్దరు మహిళలను బలవంతంగా నిర్బంధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆ ఇద్దరు మహిళల తల్లితండ్రులు దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా గతంలో మద్రాస్ హైకోర్టు ఇషా ఫౌండేషన్ పై కేసులు నమోదు చేసి విచారణకు ఆదేశించింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఇషా ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇషా ఫౌండేషన్ కు ఊరటనిచ్చింది.
తమిళనాడుకు చెందిన ఇద్దరు మహిళలు ఇష్టపూర్వకంగా తాము ఇషా ఫౌండేషన్ లో చేరామని గతంలో తెలిపారు. అయితే వారి తల్లితండ్రులు మాత్రం సద్గురు ఆశ్రమం తమ పిల్లల్ని వారికి ఇష్టం లేకపోయినా సన్యాసినులుగా మారుస్తోందంటూ ఆరోపించారు. దీంతో మద్రాస్ హైకోర్టు జోక్యం చేసుకుని విచారణకు ఆదేశించింది. అయితే సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో మాత్రం ఆ ఇద్దరు మహిళలు వారి ఇష్టప్రకారమే అక్కడ ఉంటున్నట్లు తేలింది.

మహిళల తల్లిదండ్రులు దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై పోలీసు దర్యాప్తు కోసం మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. ఆ ఇద్దరు మహిళలు ఇష్టప్రకారమే ఇషా ఫౌండేషన్ లో ఉంటున్నారని వెల్లడించినందున ఈ కేసును కొనసాగించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తేల్చింది. ఇద్దరు మహిళలతో వర్చువల్ గా మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వారి స్టేట్‌మెంట్‌లను రికార్డ్ చేశారు. ఇద్దరు మహిళలు తమ ఇష్టానుసారం ఆశ్రమంలో నివసిస్తున్నారని వాంగ్మూలం ఇవ్వడంతో కేసును ఉపసంహరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications