మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ కు అనూహ్య షాక్ లు-తప్పిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు !
కాంగ్రెస్ పార్టీకి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎదురుదెబ్బలు తప్పడం లేదు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటూ ఓవైపు తెలంగాణలో దూసుకుపోతున్న కాంగ్రెస్ పార్టీ... ప్రస్తుతం అధికారంలో ఉన్న ఛత్తీస్ ఘడ్ తో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న మధ్య ప్రదేశ్ లోనూ షాకులు తప్పడం లేదు. ఈ రెండు రాష్ట్రాల్లో ఉదయం ప్రారంభమైన కౌంటింగ్ లో సరళిని గమనిస్తే బీజేపీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది.
మధ్యప్రదేశ్ లో 230 సీట్లు ఉండగా.. ఇందులో బీజేపీ ఇప్పటికే 150 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. కాంగ్రెస్ మాత్రం 70 సీట్లకు కాస్త అటు ఇటుగా ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అటు ఛత్తీస్ ఘడ్ లోనూ 90 సీట్లు ఉండగా.. ఇందులో ఆరంభంలో ఆధిక్యంలో నిలిచిన కాంగ్రెస్ పార్టీకి కౌంటింగ్ ముందుకు సాగే కొద్దీ షాకులు తగులుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సీఎం భూపేష్ బఘేల్ తో పాటు పలువురు కీలక అభ్యర్ధులు వెనుకంజలో ఉన్నారు. అదే సమయంలో బీజేపీ మ్యాజిక్ మార్క్ 46 సీట్లను దాటి ఆధిక్యంలో నిలుస్తోంది.

మధ్యప్రదేశ్ లో తాజా ట్రెండ్స్ గమనిస్తే బీజేపీ 157 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం కేవలం 70 సీట్లలో ఆధిక్యంలో ఉంది. మరో 3 సీట్లలో ఇతరులు ఆధిక్యంలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కొనసాగితే మరో రెండు, మూడు గంటల్లోనే బీజేపీ విజయం ఖాయం కానుంది. మధ్యప్రదేశ్ లో అధికార బీజేపీపై ఉన్న ప్రజా వ్యతిరేకత కాంగ్రెస్ కు లాభిస్తున్నా అది విజయం వరకూ తీసుకెళ్లే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే తేల్చేశాయి. వాటి అంచనాలను మించి ఇప్పుడు బీజేపీ ఫలితాలు సాధిస్తోంది.
ఛత్తీస్ ఘడ్ లో ఫలితాల తాజా ట్రెండ్స్ గమనిస్తే.. బీజేపీ 53 సీట్లలోనూ, కాంగ్రెస్ కేవలం 36 సీట్లలో ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మరో 2 సీట్లలో ఇతరులు ముందంజలో ఉన్నారు. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే ఇక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్ని తారుమారు చేస్తూ బీజేపీ ఇక్కడ మ్యాజిక్ మార్కు అయిన 45 సీట్లను దాటేసి 53 సీట్లలో గెలిచేలా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications