పండగ వేళ విషాదం: నీట మునిగి 46 మంది మృతి, 37 మంది చిన్నారులు
పాట్నా: బీహార్ రాష్ట్రంలో 'జితియా' లేదా 'జీవిత్‌పుత్రిక వేడుక సందర్భంగా పెను విషాదం చోటు చేసుకుంది. పండగ సందర్భంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నదీ స్నానాలు చేసే క్రమంలో 46 మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 37 మంది చిన్నారులు ఉండగా.. 8 మంది మహిళలు ఉన్నారు. గల్లంతైన మరో ముగ్గురి కోసం గాలింపు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బీహార్ రాష్ట్ర వ్యాప్తంగా జీవిత్ పుత్రిక పండగ జరుపుకున్నారు ప్రజలు. తమ పిల్లల క్షేమం కోసం తల్లులు ఉపవాసం ఉండటంతోపాటు పిల్లలతో కలిసి నదులు, సరస్సుల్లో పవిత్ర స్నానాలు చేస్తారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలోని నదుల్లో స్నానాలు ఆచరిస్తూ 46 మంది గల్లంతై ప్రాణాలుకోల్పోయారు.

వీరిలో ఇప్పటి వరకు 43 మంది మృతదేహాలను వెలికితీసినట్లు విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. మిగితావారి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (SDRF) బృందాలను సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కోసం మోహరించాయి.
తూర్పు, పశ్చిమ చంపారన్, నలంద, ఔరంగాబాద్, కైమూర్, బక్సర్, సివాన్, రోహ్తాస్, సరన్, పాట్నా, వైశాలి, ముజఫర్పూర్, సమస్తిపూర్, గోపాల్ గంజ్, అర్వాల్ జిల్లాల్లో ఈ విషాద ఘటనలు చోటు చేసుకున్నాయి.
ఈ విషాద ఘటనలపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షల చొప్పున నష్ట పరిహారం అందజేస్తామని ప్రకటించారు. నష్టపరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైందని, చనిపోయినవారిలో ఎనిమిది మంది కుటుంబాలకు ఇప్పటికే పరిహారం అందిందని సీఎంవో ఓ ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications