కేజ్రీవాల్ కు మద్దతుగా నితీష్ కుమార్
ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య 'పవర్ వార్' కొనసాగుతోంది. అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో అధికారాలు ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉండాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఐఏఎస్ అధికారుల బదిలీలపై దృష్టిపెట్టారు. ఈ నేపథ్యంలో ఈ అధికారాలకు కత్తెర వేస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డినెన్స్ తెచ్చింది.
ఈ ఆర్డినెన్స్ ద్వారా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీసెస్ అథారిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఢిల్లీ ప్రభుత్వంలోని ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాలపై ఈ అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. ముఖ్యమంత్రి చైర్ పర్సన్ గా, చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ హోం సెక్రటరీ సభ్యులుగా ఉంటారు. నిర్ణయాలన్నీ మెజారిటీ ప్రాతిపదికగా ఉంటాయి. ఓటింగ్ లో ఫలితం తేలకపోతే లెఫ్టినెంట్ గవర్నర్ దే అంతిమ నిర్ణయం అవుతుంది.

ఈ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీయాదవ్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలన్నింటినీ కూడగట్టాలని నితీష్ ప్రయత్నిస్తున్నారు. రాజ్యసభలో ప్రతిపక్షాలను కూడగట్టి రాజ్యసభలో ఈ బిల్లును వ్యతిరేకించాలని భావిస్తున్నారు.
రాజ్యసభలో ఈ బిల్లు పాస్ కాకపోతే 2024 ఎన్నికలకు ముందు భారతీయ జనతాపార్టీ ఓడిపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ బిల్లును వీగిపోయేలా చేస్తే తర్వాత ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ప్రభుత్వానికి పనిచేసే హక్కును సుప్రీంకోర్టు కల్పించిందని, దాన్ని మీరెలా తీసేస్తారంటూ నితీష్ బీజేపీని ప్రశ్నించారు. చట్టబద్దమైన పరిపాలను అనుసరించాలని, ప్రజల మధ్య సామరస్యం ఉండాలని, వారి మధ్య వైషమ్యాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వెలిబుచ్చారు.












Click it and Unblock the Notifications