సుప్రీంలో పంతం నెగ్గించుకున్న రఘురామ..! కీలక తీర్పు..!
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (raghurama krishna raju) ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. తన నియోజకవర్గం ఉండి పరిధిలోకి వచ్చే ఆకివీడు రామాలయం విషయంలో తలెత్తిన వివాదం నేపథ్యంలో ఆయన స్థానిక కోర్టు నుంచి హైకోర్టుకు, చివరికి సుప్రీంకోర్టు వరకూ వరకూ వెళ్లి ఊరట పొందారు. ఈ మేరకు ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ మంజూరు చేసింది. దీనిపై రఘురామ హర్షం వ్యక్తం చేశారు.
ఆకివీడు రామాలయంపై చాలా బలమైన వాదోపవాదాల తర్వాత సుప్రీంకోర్టు జడ శ్రావణ్ కుమార్ వేసిన పిటిషన్ ను కొట్టేసిందని రఘురామ తాజా వీడియోలో వెల్లడించాలు. హైకోర్టులో జరిగిన విషయం చెప్పకుండా ప్రతివాదులు సుప్రీంలో స్టేటస్ కో తీసుకున్నారని, హైకోర్టు మూడు బెంచ్ లు తోసిపుచ్చిన వాదనల్ని సుప్రీంకోర్టులో దాచిపెట్టడం వల్ల గతంలో స్టే వచ్చిందని తెలిపారు. ఇప్పుడు ఆ విషయం తెలిసి సుప్రీంకోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. ఆకివీడులో 90 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో ఓ దేవాలయం ఉన్నప్పుడు , తిరిగి అదే స్థలంలో దేవాలయం కట్టుకుంటే తప్పేంటని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ ను కొట్టేసిందన్నారు.

ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) July 27, 2026
రామాలయం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుయోధన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించిన ప్రేరణ సింగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ నాకు… pic.twitter.com/RhEeloHRop
నవంబర్ నెలాఖరుకు ఆకివీడులో రామాలయం పూర్తి చేస్తామని రఘురామ ప్రకటించారు. నాలుగు సెంట్ల స్థలమే అయినా సర్వాంగ సుందరంగా రామాలయం నిర్మిస్తామని తెలిపారు. ఇప్పటికైనా గొడవలకు స్వస్తి పలికి రామాలయం నిర్మాణానికి సహకరించాలని అన్ని మతాల్ని రఘురామ కోరారు. మన మతాన్ని ప్రేమించుకుందాం, అన్యమతాల్ని గౌరవిద్దామనే ఉద్దేశంతో తాము ఉన్నామని, అదే ఉద్దేశంతో అందరూ ఉండాలని కోరారు. మత సామరస్యం అవసరమని, ఎవరి మతానికి సంబంధించిన ఆలయాన్ని వారు అనుమతులు తీసుకుని కట్టుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదన్నారు. అనుమతులు లేకుండా కడితే చట్టప్రకారం ఎవరైనా చర్యలు తీసుకోవచ్చన్నారు.












Click it and Unblock the Notifications