పసి ప్రాణాలను పీక్కుతింటున్న ఎలుకలు! మొద్దునిద్రలో అధికారులు
చదువుల గురుకులాలు అజ్ఞానాన్ని తొలగించి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును ప్రసాదించాల్సిన పవిత్ర దేవాలయాలు కావాలి. కానీ, నేడు అవే పాఠశాలలు చిన్నారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో వెలుగుచూసిన దారుణ ఘటనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రాత్రి పూట ప్రశాంతంగా గాఢ నిద్రలో ఉన్న విద్యార్థినులను ఎలుకలు విచక్షణారహితంగా కొరికి తీవ్రంగా గాయపరిచాయి. రాత్రి వేళల్లో హస్టల్ గదుల్లోకి ప్రవేశించి చిన్నారుల సున్నితమైన శరీరంపై దాడులు చేస్తుంటే ఆ పిల్లలు పడిన భయం, అనుభవించిన వేదన వర్ణనాతీతం.
ఇంతటి ప్రమాదం జరిగితే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన పాఠశాల సిబ్బంది, యాజమాన్యం అత్యంత బాధ్యతారహితంగా ప్రవర్తించారు. అసలు ఈ విషయం బయటకు రాకుండా, ఎవరికీ తెలియకుండా తీవ్రమైన గోప్యత పాటించారు. కనీసం తల్లిదండ్రులకు కూడా సకాలంలో సమాచారం ఇవ్వకపోవడంపై సర్వత్రా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఎవరికైనా ఈ విషయం తెలిస్తే అధికారులపై చర్యలు తీసుకుంటారనే భయంతో బాధితులను గుట్టుచప్పుడు కాకుండా బుధవారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వనం శ్రీనివాస్ స్పందిస్తూ మొత్తం 14 మంది విద్యార్థినులకు ఆసుపత్రిలో చికిత్స అందించినట్లు స్పష్టం చేశారు.
యూనివర్సిటీ హాస్టళ్లలోనూ ఆగని ఎలుకల ప్రతాపం..
ఎలుకల సమస్య నుంచి కేవలం పాఠశాలలే కాకుండా ఉన్నత విద్యను అందించే ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాలు కూడా తప్పించుకోలేకపోతున్నాయి. గతంలో కాకతీయ యూనివర్సిటీలోని సమ్మక్క-సారలమ్మ హాస్టల్‌లో కూడా సరిగ్గా ఇలాంటి ఘటనే పునరావృతమైంది. మార్చి 31వ తేదీ రాత్రి సమయంలో హాస్టల్‌లో నిద్రిస్తున్న ఏకంగా 11 మంది విద్యార్థులను ఎలుకలు కరిచిన వైనం అప్పట్లో విద్యార్థి లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది.
ఈ ఘటన క్యాంపస్‌లో పారిశుద్ధ్య నిర్వహణకు అధికారులు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో అద్దం పడుతోంది. ఎలుకలు కరిచి తీవ్ర గాయాలతో విలవిల్లాడుతూ విద్యార్థులు రాత్రికి రాత్రే నేరుగా క్యాంపస్‌లోని హెల్త్ సెంటర్‌కు పరుగులు తీస్తే, అక్కడ కనీసం ప్రాథమిక చికిత్సకు అత్యవసరంగా కావాల్సిన 'టీటీ ఇంజెక్షన్' కూడా అందుబాటులో లేకపోవడం అధికారుల నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా నిలిచింది. చివరికి విద్యార్థులు అర్ధరాత్రి సమయాల్లో సమీపంలోని బయటి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి తమ సొంత డబ్బులు వెచ్చించుకుని ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన దుస్థితి నెలకొంది.
సాధారణంగా ఇలాంటి సమస్యలు చిన్నవిగా అనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా ఇవి ప్రాణాంతకమైన ప్రమాదకర పరిణామాలకు దారి తీసే అవకాశం ఉందని విద్యార్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హాస్టళ్లలో ఈ ఎలుకల సమస్య కొత్తది కాదని, చాలా కాలంగా తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో గదుల్లోకి ప్రవేశించే ఎలుకలు ఆహార పదార్థాలను, పుస్తకాలను, ఇతర వస్తువులను కొరుకుతూ విద్యార్థుల నిద్రకు తీవ్ర భంగం కలిగిస్తున్నాయని చెబుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు హాస్టల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, వారు ఎలాంటి శాశ్వత చర్యలు తీసుకోలేదని తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి.
తెలంగాణలో నమోదైన ఘోరమైన ఘటనలు
2024 డిసెంబర్ 17న ఖమ్మం జిల్లా దానవాయిగూడెం ప్రభుత్వ బీసీ హాస్టల్‌లో ఎలుకలు విద్యార్థులపై విరుచుకుపడ్డాయి. మార్చి నుంచి నవంబర్ వరకు దాదాపు 15 సార్లు ఎలుకలు ఓ విద్యార్థిని కొరికాయి. దీంతో తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది.
2023 డిసెంబర్ 23న నాగర్ కర్నూల్ జిల్లాలో నాగనూల్ గ్రామంలో 40రోజుల పసిబిడ్డ ముక్కును ఎలుక కొరకడంతో మృతి చెందాడు. ఈ ఘటన ఇంట్లో జరిగినప్పటికి.. హైదరాబాద్ నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స అందించినా ఫలితం లేకపోయింది.
ప్రభుత్వాలు మారినా మారని వైద్య, వసతి రంగాల దుస్థితి..
గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డులో చికిత్స పొందుతున్న ఒక పసికందును ఎలుకలు కొరికి పొట్టనబెట్టుకున్న దారుణమైన ఘటనను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఆ ఘటన తర్వాత కూడా ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం ఏమాత్రం మార్పు చెందకపోవడం, నిర్లక్ష్యపు ధోరణిని వీడకపోవడం వల్లనే నేటికీ ఇలాంటి దుస్థితి పునరావృతమవుతోంది. గడచిన ఆదివారం నాడు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో మార్చురీలో భద్రపరిచిన ఓ డెడ్ బాడీని ఎలుకలు కొరికి తిన్న ఘటన కలకలం సృష్టించింది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ హాస్టళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు ఎలుకలకు శాశ్వత నివాస కేంద్రాలుగా మారిపోతున్నాయనడానికి ఈ వరుస ఘటనలే ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. రాత్రి వేళల్లో గదుల్లోకి చొరబడి విద్యార్థులను గాయపరుస్తున్నా అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కూడా లేకపోవడం అత్యంత బాధాకరం.
ఇప్పటికైనా పాలకులూ, సంబంధిత అధికారులు నిద్రమత్తు వీడి, విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న తీరును మార్చుకోవాలి. హాస్టళ్లలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు ఎలుకల నివారణకు కఠినమైన శాశ్వత చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
