పులస చేపను ఛీ కొట్టిన దేశం! దిగుమతులు బ్యాన్
పులస దొరికితే చాలు పండగే మనోళ్లకు.. ఈ చేప డిమాండ్ అలా ఉంటుంది మరి మన దేశంలో. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో "పుస్తెలమ్మైనా సరే పులస తినాల్సిందే" అనే సామేత ఉండనే ఉందిగా. అలాంటి పులస చేప మనకి దొరికడమే కష్టం. దొరికినా వేలం పాటలో అందరికంటే ఎక్కువ ధరకు పాడితేనే మన నోటి దాకా వెళ్తుంది. అంత రుచికరమైన పులసను ఎవరైనా ఛీ కొడతారా చెప్పండి. ఇప్పుడు సరిగ్గా అలాంటి పరిస్థితే వచ్చింది. పొరుగు దేశం బంగ్లాదేశ్ మన పులసను ఛీకొట్టింది.
ప్రపంచంలోనే అత్యధికంగా పులస (ఇల్సా) చేపలను ఉత్పత్తి చేసే దేశంగా పేరున్న బంగ్లాదేశ్, ఇటీవల ఊహించని పరిణామాలకు కేంద్ర బిందువుగా మారింది. స్వదేశంలో ఈ చేపల ఉత్పత్తి తగ్గిపోయి, ధరలు ఆకాశాన్నంటుతుండటంతో.. తొలిసారిగా భారత్ నుంచి, ముఖ్యంగా గుజరాత్ ప్రాంతం నుంచి పులసలను దిగుమతి చేసుకోవాలని ఆ దేశం నిర్ణయించింది. ఈ పరిణామం అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. అయితే, ఈ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. భారత్ నుంచి దిగుమతులు ప్రారంభమైన కొద్ది రోజులకే బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా దిగుమతులు నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.

హ్యాండ్ఓవర్ చేసుకున్న ఎన్‌ఓసీలు రద్దు.. దిగుమతిదారుల విలవిల..
బంగ్లాదేశ్ మత్స్య శాఖ తీసుకున్న ఈ అకస్మాత్తు నిర్ణయంతో ఆ దేశానికి చెందిన దిగుమతిదారులు తీవ్ర గందరగోళంలో పడ్డారు. ఇప్పటికే వ్యాపారులకు జారీ చేసిన దాదాపు 103 నో-అబ్జెక్షన్ సర్టిఫికెట్లు రద్దు చేస్తూ ఆ శాఖ తాత్కాలిక డైరెక్టర్ జనరల్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి దాదాపు 1,739.50 టన్నుల పులసలను దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇచ్చి, సడన్‌గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. గుజరాత్‌లోని భరూచ్ పోర్ట్ ద్వారా, బెనాపోల్ సరిహద్దు మీదుగా దిగుమతి చేసుకోవడానికి సిద్ధం చేసిన స్టాక్‌ను వెనక్కి పంపాల్సి వస్తోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత్‌లో కొనుగోలు చేసి నిల్వ చేసిన చేపలను తక్కువ ధరకు తిరిగి ఇవ్వాల్సి వస్తోందని, దీనివల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోందని వాపోతున్నారు.
అసలు గుజరాత్ పులసలకు బంగ్లాదేశ్‌లో ఎందుకంత గిరాకీ?
బంగ్లాదేశ్‌లోని పద్మా నదిలో దొరికే పులస చేపలకు ఉన్న ప్రత్యేకత వేరు. ఆ చేపల్లోని కొవ్వు, నూనె తెచ్చే సువాసన, అద్భుతమైన రుచి ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. అయితే అక్కడి స్థానిక ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాలుగా క్రమంగా పడిపోతూ వస్తోంది. 2022లో 5,71,324 టన్నులుగా ఉన్న ఉత్పత్తి, 2025 నాటికి 5,00,000 టన్నులకు పడిపోయింది. దీంతో 2018లో కిలో 705 రూపాయలుగా ఉన్న ధర, ఈ ఏడాది ఆగస్టు నాటికి ఏకంగా 2,600 రూపాయలకు ఎగబాకింది. ఈ తరుణంలో నర్మదా నదిలో లభించే గుజరాత్ పులసలు బంగ్లాదేశ్ మార్కెట్లోకి తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ఈ చేపలను స్థానిక పద్మా రకం చేపలుగా కలిపి విక్రయించడంతో పాటు, వాటి గుడ్లను ప్రత్యేక వంటకాల కోసం, ప్రాసెసింగ్ యూనిట్లలో ముడిసరుకుగా వాడేవారు. స్థానిక డిమాండ్‌ను తట్టుకునేందుకు ఈ దిగుమతులు ఎంతో ఊరటనిచ్చాయి.
పద్మా పులసలపై నీలి నీడలు.. భారత్‌కు మొండిచెయ్యేనా?
బంగ్లాదేశ్ తీసుకున్న ఈ అనూహ్య నిర్ణయం కేవలం దిగుమతుల వరకే పరిమితం కాలేదు. ప్రతి ఏటా దుర్గాపూజ పండుగను పురస్కరించుకుని భారత్‌కు, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లోని మత్స్య ప్రియులకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కానుకగా 'పద్మా పులసలను' ఎగుమతి చేస్తుండేది. గత ప్రభుత్వాల హయాంలో ఈ సంప్రదాయం కొనసాగినప్పటికీ, ఈ ఏడాది ఇప్పటివరకు ఎలాంటి ఎగుమతులకు సంబంధించి స్పష్టత రాలేదు. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ నుంచి జరిగే దిగుమతులను నిలిపివేసిన బంగ్లాదేశ్, ఇటు మన దేశానికి పద్మా చేపలను పంపే విషయంలోనూ అదే పంథాను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వెనుక అసలు కారణమేంటో స్పష్టత కరవు..
భారత్ నుంచి పులసల దిగుమతులను నిలిపివేయడానికి గల అసలు కారణాలను మత్స్య శాఖ అధికారికంగా ఎక్కడా వెల్లడించలేదు. అయితే, భారతీయ గుజరాత్ పులసలను స్థానిక 'పద్మా' చేపల పేరుతో అమ్ముతుండటాన్ని అడ్డుకోవడానికి, అలాగే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కారణం ఏదైనాసరే, ప్రభుత్వాల ఈ పూచీలేని, అకస్మాత్తు నిర్ణయాలు సరిహద్దు వాణిజ్యాన్ని నమ్ముకున్న వ్యాపారులను రోడ్డున పడేస్తున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.














Click it and Unblock the Notifications
