మరో కొత్త పథకంతో ఏపీలో మహిళలకు శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి, ముఖ్యంగా ప్రజల తల్లులు, నవజాత శిశువుల సంరక్షణకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు, నవజాత శిశువులకు అవసరమైన 14 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుంది .
ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచడం, శిశు మరణాలను తగ్గించడం, నిరుపేద కుటుంబాలపై ఆర్థికభారం తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కిట్‌లో దోమల తెరతో కూడిన బేబీ బెడ్, వాటర్‌ప్రూఫ్ రబ్బర్ షీట్, బేబీ డ్రస్, టవల్, మూడు బేబీ న్యాప్కిన్ లు ఉంటాయి.

ఇవి మాత్రమే కాదు జాన్సన్స్ బేబీ పౌడర్ 200 గ్రాములు, జాన్సన్స్ బేబీ షాంపూ 100 మి.లీ, బేబీ ఆయిల్ 200 మి.లీ, బేబీ సోప్, సోప్ బాక్స్, శిశువుల కోసం ఆరు బొమ్మలు, సామగ్రి తీసుకెళ్లే బ్యాగ్ వంటి వస్తువులు ఉంటాయి. మార్కెట్‌లో ఒక్కో కిట్ ధర సుమారు రూ.1400 వరకు ఉంటుంది. కానీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు ఇది పూర్తిగా ఉచితంగా అందించనున్నారు.
వైద్యారోగ్య శాఖ ఈ పథకం కోసం ఏటా రూ.51.15 కోట్ల బడ్జెట్ కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి సంవత్సరం దాదాపు 2.45 లక్షల మంది నవజాత శిశువులకు ఈ కిట్లు అందించనున్నారు. కిట్ల నాణ్యత, సరఫరా బాధ్యతలు ఏపీ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చూసుకుంటుంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే సమయంలో నేరుగా తల్లులకు ఈ కిట్ లను అందిస్తారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పంపిణీ జరుగుతుంది.
గ్రామీణ ప్రాంతాల్లోని గర్భిణీలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి అప్పుల పాలు కాకుండా ప్రభుత్వ ఆసుపత్రులను ఎంచుకునేలా ఈ పథకం ప్రోత్సహిస్తుంది. తల్లి, బిడ్డ ఆరోగ్య సంరక్షణకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎంతో ఆదరణ పొందిన ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం తిరిగి తీసుకురావడం నిరుపేద కుటుంబాలకు గొప్ప ఉపశమనంగా చెప్పవచ్చు.













Click it and Unblock the Notifications
