vastu tips: వాస్తు ప్రకారం చీపురు లక్ష్మీదేవితో సమానం.. కొన్ని జాగ్రత్తలు తీసుకోండి!
ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరియాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం నిలవాలన్నా మనం పాటించే చిన్న చిన్న అలవాట్లే కీలకం. మన సంస్కృతిలో చీపురును కేవలం ఇంటిని శుభ్రం చేసే సాధనంగా కాకుండా, సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా పూజిస్తారు. వాస్తు నిపుణులు, పండితులు చెప్పే కొన్ని ముఖ్యమైన నియమాలను గమనిస్తే... అడుగడుగునా శుభఫలితాలు అందుతాయి. దురదృష్టం దరిచేరకుండా ఉంటుంది.
కొనుగోలు సమయం - పాటించాల్సిన గౌరవం
లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రోజున కొనుగోలు చేయడం అత్యంత శ్రేయస్కరం. పండుగలు, ఇంట్లోని వారి జన్మదినాలు, మంగళవారాల్లో కొనడం మంచిది కాదు. పొరపాటున కూడా కాళ్లతో తొక్కడం లేదా దాటడం చేయకూడదు. అలా చేస్తే సంపదను అగౌరవపరిచినట్లే. నిటారుగా గోడకు ఆనించి ఉంచితే ఇంట్లో ధనం నిలవదు. ఎల్లప్పుడూ అడ్డంగా పడుకోబెట్టడమే సరైన పద్ధతి. ప్రధాన తలుపుల వెనుక లేదా మూలల్లో ఎవరి కంటా పడకుండా ఉంచాలి. బహిరంగంగా ఉంచితే ప్రతికూల శక్తులు పెరుగుతాయి. బీరువా లేదా బంగారం, ధనం దాచే ప్రదేశాలకు దగ్గరగా ఉంచకూడదు.

వంటగదిలో అస్సలు వద్దు!
ఆహారాన్ని సిద్ధం చేసే వంటగది అన్నపూర్ణాదేవి నివాసం. అక్కడ ఇంటిని శుభ్రం చేసే వస్తువులను ఉంచితే ధాన్య లోపం, అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.పాడైపోయినదాన్ని పారవేయడానికి శనివారం మాత్రమే అనుకూలం. గురు, శుక్రవారాలతో పాటు ఏకాదశి వంటి పవిత్ర దినాల్లో బయట పడేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని నమ్ముతారు. సంధ్యా సమయం దాటాక ఇల్లు ఊడ్చడం శుభకరం కాదు. ఇంటి లోపల, బయట ఊడ్చేందుకు ప్రత్యేకంగా వేర్వేరుగా ఉంచుకోవాలి. ఎవరైనా మంచి పనిపై బయటకు వెళ్లే సమయంలో ఇల్లు తుడవకూడదు. జంతువులను దీంతో కొట్టడం తీవ్రమైన దోషం. దేవుడి గదిని శుభ్రం చేయడానికి ప్రత్యేకమైన వస్త్రాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఈ సాంప్రదాయ వాస్తు నియమాలను నిష్ఠతో పాటిస్తే ఇంట్లో ప్రశాంతత, ఐశ్వర్యం కలకాలం నిలుస్తాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications