Bihar Election 2025: ఈ 21 మంది బీజేపీ ఎమ్మెల్యేల టికెట్లు కట్? కారణాలివే!
Bihar Election 2025: బీహార్‌లో నవంబర్ 6, నవంబర్ 11న రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 14న ఫలితాలు కూడా వెలువడనున్నాయి. ఎన్నికల సంఘం ఈ ప్రకటన చేయడంతో బీహార్‌లో రాజకీయ వేడి పెరిగింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు తుది రూపునిచ్చే పనిలో పడ్డాయి. బీజేపీ ఈ విషయంపై రెండో రోజుల పాటు పాట్నాలో సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి, బీహార్ ఎన్నికల పార్టీ ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్, ఎన్నికల సహ-ఇంఛార్జ్ సీఆర్ పాటిల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే పాల్గొన్నారు. ప్రతి సీటు, అక్కడి నుంచి అభ్యర్థి ఎవరనే దానిపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఈ చర్చల అనంతరం బీజేపీ ఇంఛార్జ్ తన నివేదికను ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి సమర్పించారు. దీనిపై తుది నిర్ణయం అధిష్ఠానం తీసుకోవాల్సి ఉంది.
పనితీరు ఆధారంగానే అవకాశం
నివేదిక, పనితీరు ఆధారంగానే ప్రస్తుత ఎమ్మెల్యేలకు తిరిగి అవకాశం ఇవ్వబడుతుందని బీహార్ ఎన్నికల పార్టీ ఇంఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్ సమావేశం అనంతరం వెల్లడించారు. అయితే వ్యతిరేకత, ఇతర సమస్యలు ఉన్న సీట్లలో కొత్త ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తున్నామని ఆయన తెలిపారు. మహిళలు, యువతకు ఎక్కువ అవకాశాలు కల్పించడంపై దృష్టి ఉందన్నారు.

60 సీట్లపై సుదీర్ఘ మధనం
243 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో ప్రస్తుతం పార్టీకి ఉన్న 60 సీట్లకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిటీ చర్చించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ తెలిపారు. 2020 ఎన్నికల్లో పార్టీ 110 సీట్లలో పోటీ చేసి 75 సీట్లు గెలుచుకుంది. పనితీరు బాగుండి, బలమైన వ్యతిరేకత లేని అభ్యర్థులకు మరోసారి అవకాశం ఇస్తారు. కానీ వ్యతిరేకత ఎదుర్కొంటున్న, పనితీరు బాగాలేని వారిని కొత్త ముఖాలతో భర్తీ చేయాలని పార్టీ నిర్ణయించింది. ఈసారి బీజేపీ మహిళలు, యువతకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని దిలీప్ జైస్వాల్ అన్నారు.
21 మంది సీనియర్ల టికెట్లపై వేటు?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటనల తర్వాత పార్టీలో అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. అనేక సీనియర్ నాయకుల పేర్లను తొలగించాలని పార్టీ నిర్ణయించింది. కొందరిని వయసు ఎక్కువ అయినందున, మరికొందరిని పనితీరు సరిగా లేనందున, ఇంకొందరిని సీనియర్ నాయకులతో సంబంధాలు సరిగా లేనందున తొలగిస్తున్నారు. పార్టీ ముఖ్యంగా చంపారన్ ప్రాంతంలో పాత ముఖాల స్థానంలో కొత్తవారిని దించాలని చూస్తోంది. రాష్ట్ర ఎన్నికల కమిటీ 21 మంది పాత ముఖాల స్థానంలో కొత్తవారిని రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై పార్టీ హైకమాండ్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీ ఇద్దరు మాజీ ఎంపీలకు కూడా అవకాశం ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
బీజేపీలో 21 మంది టికెట్ రద్దయ్యే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు వీరే..!
1.భాగీరథీ దేవి-రామ్ నగర్ నియోజకవర్గం- 2024 అవిశ్వాస తీర్మానం సమయంలో మహాకూటమి ప్రభావంలో ఉన్నారు.
2.రశ్మి వర్మ -నరకటియాగంజ్ నియోజకవర్గం- అవిశ్వాసం సమయంలో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి మాయం, తిరుగుబాటు ఆరోపణ.
3.మిశ్రీ లాల్ యాదవ్ -అలీ నగర్- అవిశ్వాసం సమయంలో తేజస్వి యాదవ్ వైపు, తిరుగుబాటు ఆరోపణ.
4.విజయ్ ఖేమ్కా- పూర్ణియా -నియోజకవర్గంలో వ్యతిరేకత .
5.జయ ప్రకాష్ యాదవ్ -నరపత్‌గంజ్ -వయసు 70 దాటడం, వ్యతిరేకత భయం.
6.విద్యా సాగర్ కేసరి-ఫార్బిస్‌గంజ్- నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత.
7.వినయ్ బిహారీ- లౌరియా -నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత.
8.జ్ఞానేంద్ర సింగ్ జ్ఞాను- బార్హ్ నియోజకవర్గం- NDA ప్రభుత్వంపై విమర్శలు, పార్టీ వ్యతిరేక ప్రకటనలు.
9.అమరేంద్ర ప్రతాప్ సింగ్-ఆరా నియోజకవర్గం- వయసు 78, లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి సరిగా సహకరించలేదనే ఆరోపణ.
10.రాఘవేంద్ర ప్రతాప్ సింగ్-బడ్‌హరా-వయసు 70 దాటడం, ఆర్కే సింగ్‌తో విభేదాలు, జేడీయూ నేతల వ్యతిరేకత.
11.కేదార్ ప్రసాద్ గుప్తా-కుధ్ని- నియోజకవర్గంలో వ్యతిరేకత, వైశ్య, కాను సమాజాల మధ్య ఘర్షణలు.
12.రామ్ సూరత్ రాయ్ -ఔరాయి- అవినీతి ఆరోపణలు, సీఎం బదిలీల ఫైల్‌ను ఆపడం.
13.అశోక్ కుమార్ సింగ్-పారూ- నియోజకవర్గంలో వ్యతిరేకత.
14.సంజయ్ కుమార్ సింగ్-లాల్‌గంజ్- నియోజకవర్గంలో వ్యతిరేకత, పార్టీ కార్యకర్తలతో సమన్వయం లేకపోవడం.
15. డా. సీఎన్ గుప్తా- చప్రా-వయసు ఎక్కువ, యువకుడికి అవకాశం ఇవ్వాలని పార్టీ యోచన.
16.రామ్ నారాయణ్ మండల్- బాంకా- నియోజకవర్గంలో వ్యతిరేకత.
17.పవన్ యాదవ్- కహల్‌గావ్- వ్యతిరేకత భయం.
18.నంద్ కిషోర్ యాదవ్- పాట్నా సాహిబ్ -వయసు 72, అసెంబ్లీ చివరి సెషన్‌లో అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ఆగ్రహం, సమ్రాట్ చౌదరితో సంబంధాలపై చర్చ.
19.అరుణ్ కుమార్ సిన్హా-కుమ్‌హ్రార్- వయసు 72, నియోజకవర్గంలో ప్రజల నుంచి తీవ్ర అసంతృప్తి.
20. వినోద్ నారాయణ్ ఝా-బెనిపట్టి-జేడీయూతో సీట్ల మార్పిడి కారణంగా.
21.వీరేంద్ర సింగ్- వజీర్‌గంజ్ నియోజకవర్గం-వయసు 72, నియోజకవర్గంలో చురుకుదనం తక్కువ, వ్యతిరేకత.












Click it and Unblock the Notifications