రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి: డెడ్ బాడీని నదిలో పడేసిన పోలీసులు
పాట్నా: పోలీసులు తాము చేయాల్సిన బాధ్యతను వదిలేసి నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం చేయాల్సి ఉండగా.. పక్కనే ఉన్న నదిలో పడేయడం వివాదాస్పదంగా మారింది. దీంతో బాధ్యులైన పోలీసులపై చర్యలకు ఆదేశించారు ఉన్నతాధికారులు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
ముజఫర్పూర్‌లో రోడ్డు ప్రమాదం జరిగిన చోటుకి వెళ్లిన పోలీసులు.. ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి మృతదేహాన్ని కాల్వలో పడేశారు.ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో వారి తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. బాధితులకు న్యాయం జరిగేలా చూడాల్సిన పోలీసులు.. కనీస మానవత్వం లేకుండా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, సదరు పోలీసులకు సీనియర్ అధికారులు వత్తాసు పలకడం శోచనీయం.

ప్రమాదంలో మృతదేహం పూర్తిగా ఛిద్రమైందని, కొన్ని శరీర భాగాలను రికవరీ చేయడానికి సాధ్యం కాకపోవడంతోనే వాటిని కాల్వలోకి పడేశారని మీడియాకు వివరణ ఇచ్చారు. ఈ అంశం ఉన్నతాధికారుల దృష్టి రావడంతో ఆగమేగాల మీద కాల్వలోని మృతదేహాన్ని వెలికి తీసి మార్చూరీ గదికి తరలించారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలకు ఉపక్రమించారు ఉన్నతాధికారులు. డ్రైవర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. మరో ఇద్దరు హోంగార్డులను విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా మొత్తం పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉన్నందున బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు.












Click it and Unblock the Notifications