Bihar Polls: బీహార్ లో మళ్లీ భారీ పోలింగ్.. ! ముందే లెక్క తేల్చేసిన పీకే..!
బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం నుంచీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో ఉదయం 11 గంటలకే 31 శాతం పైగా ఓట్లు పోలయినట్లు అధికారులు ప్రకటించారు. తొలి దశలో రికార్డు స్దాయిలో 65 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఇవాళ ఆ రికార్డు చెరిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బీహార్ అసెంబ్లీకి జరుగుతున్న రెండో విడత ఎన్నికల్లో భాగంగా ఇవాళ 122 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈసారి ఎన్డీయే, మహాకూటముల మధ్య గట్టి పోటీ నెలకొన్న నేపథ్యంలో ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు. దీంతో ఈసారి బీహార్ లో పెనుమార్పు తప్పదనే అంచనాలు నెలకున్నాయి. ఇవాళ ఉదయం ఓటింగ్ సరళిని పరిశీలించిన జన్ సురాజ్ పార్టీ అధినేత, మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఓటింగ్ నెమ్మదిగా జరగడం లేదని, స్వాతంత్య్రం తర్వాత ఈ ఎన్నికల మొదటి దశలో రాష్ట్రంలో గరిష్ట ఓటింగ్ జరిగిందని బీహార్ ఓటర్లు చూపించారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. ఈ రోజు పోలింగ్ శాతం 65 శాతం మించి ఉంటుందని ఆయన అంనా వేశారు. ఇవాళ పోలింగ్ కొత్త రికార్డును సృష్టిస్తుందని తాను నమ్ముతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఓటు మార్పు తీసుకురావడానికి , యువతకు విద్య, ఉపాధిని నిర్ధారించడానికే అన్నారు. నవంబర్ 14 తర్వాత బీహార్‌లోని ఏ యువకుడు 10 వేలు-14 వేలు సంపాదించడానికి రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆశిస్తున్నట్లు తెలిపారు.

బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలిదశలో 65.08 శాత పోలింగ్ నమోదు కావడంతో అధికార ఎన్డీయేతో పాటు విపక్ష మహాకూటమి భారీ అంచనాల్లో ఉన్నాయి. పెరిగిన పోలింగ్ శాతం తమకే అనుకూలమని చెబుతున్నాయి. ఇప్పుడు రెండో దశలో కేవలం ఉదయం 11 గంటలకే 31 శాతం పైగా పోలింగ్ నమోదు కావడంతో సాయంత్రానికి 70 శాతం చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. అదే జరిగితే ప్రజలు మార్పుకు అనుకూలంగా ఓటేసినట్లే అని ప్రశాంత్ కిషోర్ అంచనా వేశారు.












Click it and Unblock the Notifications