ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు దుర్మరణం!
బీహార్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం నలంద జిల్లాలోని ఓ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 8 మంది మహిళా భక్తులు మృతి చెందగా.. మరో డజనుకు పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నలంద జిల్లా బీహార్ షరీఫ్ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మఘ్పా గ్రామంలోని శీతలాష్టమి ఆలయంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది. చైత్ప మాసం చివరి మంగళవారం కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణం సామర్థ్యానికి మించి జనం రావడంతో పరిస్థితి అదుపు తప్పింది. అధికారుల నిర్లక్ష్యం, కనీస ఏర్పాట్లు లేకపోవడమే ఈ పెను విషాదానికి కారణమని స్థానికులు మండిపడుతున్నారు.
నిర్వహణ లోపం.. క్షణాల్లో మారిన దృశ్యం
దైవదర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ఒకేసారి గర్భాలయం వైపు దూసుకురావడంతో తీవ్రమైన తోపులాట మొదలైంది. భారీ జనాన్ని నియంత్రించేందుకు అక్కడ తగినంత మంది పోలీసులు గానీ.. వాలంటీర్లు గానీ లేకపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పడిపోవడంతో తొక్కిసలాట జరిగింది. ఊపిరాడక, కాళ్ల కింద నలిగి 8 మంది మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరికొందరు స్పృహ తప్పి పడిపోయారు.

హృదయ విదారకం
ప్రమాదం జరిగిన తర్వాత ఆలయ ప్రాంగణం ఆర్తనాదాలతో మారుమోగిపోయింది. స్పృహ కోల్పోయి నేలపై పడి ఉన్న మహిళలను కాపాడేందుకు తోటి భక్తులు శతవిధాలా ప్రయత్నిచారు. కొందరికి సీపీఆర్ చేసి ప్రాణం పోసే ప్రయత్నం చేయగా.. మరికొందరు స్పృహ తప్పిన వారి ముఖంపై నీళ్లు చల్లుతూ.. నోట్లో వేళ్లు పెట్టి శ్వాస ఆడుతుందో లేదో అని చూస్తూ విలపించడం అక్కడి భయానక పరిస్థితికి అద్ధం పట్టింది. ఈ తొక్కిసలాట ఘటనలో ప్రాణ భయంతో అరిచిన కేకలు చూపరుల మనసులను కలిచివేస్తున్నాయి.
#BREAKING
— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) March 31, 2026
बिहार के नालंदा स्थित शीतला मंदिर में अत्यधिक भीड़ होने के कारण भगदड़ हो गई जिससे कई लोग दब गए है।
हादसे में अबतक 8 लोगों की मौत हो गई है और दर्जन से अधिक लोग जख्मी हुए है। #Bihar #Nalanda #Stampede #NalandaStampede pic.twitter.com/zROA4m5Qy8
మండిపడుతున్న భక్తులు
ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాట్నా నుంచి దర్శనం కోసం వచ్చిన మమతా దేవి అనే భక్తురాలు మాట్లాడుతూ.. "ఇక్కడ ప్రతి మంగళవారం రద్దీ ఉంటుందని అందరికీ తెలుసు. కనీసం అంబులెన్స్ సౌకర్యం కూడా ముందుగా ఏర్పాటు చేయలేదు. ప్రమాదం జరిగి ప్రాణాలు పోయాక అధికారులు వస్తున్నారు. సరైన బారికేడ్లు, జన నియంత్రణ ఉండి ఉంటే ఈరోజు ఈ ప్రాణాలు పోయేవి కావు" అని కన్నీటి పర్యంతమయ్యారు.
కొనసాగుతున్న సహాయక చర్యలు
ఘటన జరిగిన కొంతసేపటికి పోలీసులు, వైద్య బృందాలు అక్కడికి చేరుకున్నాయి. గాయపడిన వారిని వెంటనే బీహార్ షరీఫ్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆలయ పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. ప్రభుత్వం ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. భక్తుల భద్రత విషయంలో జరిగిన లోపాలపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహిస్తున్నారు.












Click it and Unblock the Notifications