నవీన్ ప్రజాదరణకు లిట్మస్ టెస్ట్: బీజేపూర్‌లో ఫిరాయింపుదార్లే కీలకం
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి శనివారం పోలింగ్ జరుగనున్నది. ఇటు అధికార బీజేడీ, అటు విపక్ష బీజేపీ హోరాహోరీ ప్రచార హోరు వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల తీరును ప్రతిబింబిస్తున్నదని స్థానికులు చెప్తున్నారు. అధికార బీజేడీ తరఫున సీఎం నవీన్ పట్నాయక్, బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ ప్రచారంలో పోటీ పడ్డారు. క్యాన్సర్ వ్యాధితో గతేడాది ఆగస్టు నెలలో మరణించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సుభాష్ సాహు భార్య గీతా సాహు.. అధికార బీజేడీ అభ్యర్థిగా నియోజకవర్గం అంతటా ప్రచారం గావించారు. రీటా సాహూ అభ్యర్థిత్వాన్ని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఖరారు చేసిన వెంటనే 2000 - 04 మధ్య బీజేడీ ఎమ్మెల్యేగా పని చేసిన అశోక్ పాణిగ్రాహీ గతేడాది అక్టోబర్‌లోనే బీజేపీలో చేరిపోయారు.
అంతకుముందు 2014 ఎన్నికల్లోనే టిక్కెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అధికార బీజేడీ అభ్యర్థి ఓటమి కారకులయ్యారు అశోక్ ప్రాణిగ్రాహీ. నామినేషన్లకు ముందు రీతా సాహు అభ్యర్థిత్వాన్ని నవీన్ పట్నాయక్ ప్రకటించినప్పుడు అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. కొందరు నవ్వుకున్నారు కూడా. ఆ వెంటనే బీజేపీ అశోక్ పాణిగ్రాహీని అభ్యర్థిగా ప్రకటించింది.

2000 తర్వాత బీజేడీ పరిస్థితిలో మార్పు
బీజేపూర్ అసెంబ్లీ స్థానంలో గెలుపే లక్ష్యంగా అధికార బీజేడీకి చెందిన ప్రముఖ నేతలు, మంత్రులు అంతా నియోజకవర్గంలోనే తిష్ట వేసి ప్రచారం చేశారు. మరోవైపు బీజేపీ కేంద్ర మంత్రులు స్మ్రుతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ తదితరులు బీజేడీకి ధీటుగానే ప్రచారం చేశారు. 2000 నుంచి ఉప ఎన్నికల్లో బీజేడీ గెలుపొందుతూ వచ్చింది. కానీ గతేడాది జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో పరిస్థితి మారుతున్నదన్న సంకేతాలు కనిపించాయి. రాష్ట్ర వ్యాప్తంగా 34 జిల్లాల జోన్ల పరిధిలో బీజేపీ 25 జిల్లా పరిషత్ జోన్లను గెలుచుకోవడమే దీనికి నిదర్శనం. బీజేపూర్ పరిధిలోని మూడు జోన్లలో రెండింట బీజేపీ గెలుపొందింది.

నవీన్ పట్నాయక్‌కు ధర్మేంద్రప్రధాన్ నుంచే సవాల్
గ్రామీణ ప్రాంత ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే గత ఎన్నికల్లో 10 సీట్లలోనే గెలుపొందిన బీజేపీ.. జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాలతో అధికార బీజేడీని ఓడించగలదన్న సంకేతాలనిచ్చింది. నాలుగుసార్లు సీఎంగా ఎన్నికైన నవీన్ పట్నాయక్ ప్రజాదరణకు బీజేపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఒక గీటురాయి వంటిదని స్థానికులు నమ్ముతున్నారు. సీఎం నవీన్ పట్నాయక్‌కు కేంద్ర మంత్రి ధర్మేంద్రప్రధాన్ ప్రధాన ప్రోటీదారుగా ముందుకు వస్తున్నారని అంటున్నారు.

70 శాతానికి పైగా ఓబీసీలే ప్రాతినిధ్యం
ఇప్పటి వరకు బీజేపూర్ అసెంబ్లీ స్థానం పరిధిలో కుల సమీకరణాలు ఏనాడూ ప్రభావం చూపలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. నియోజకవర్గంలోని 2.25 లక్షల మంది జనాభాలో 70 శాతానికి పైగా ఓబీసీలే. కానీ వివిధ పార్టీల్ల్లో పిరాయింపుదార్లే ఈ ఉప ఎన్నికలో కీలకంగా వ్యవహరిస్తారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి బీజేడీలోకి భారీగానే నేతలు వచ్చి చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణన్ సాహు, కాంగ్రెస్ పార్టీకి చెందిన బార్పాలీ నోటిఫైడ్ ఏరియా కౌన్సిల్ చైర్మన్, వైస్ చైర్మన్ తదితరులు బీజేడీలో చేరిపోయారు. నేతల నిష్క్రమణతో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిందన్న విమర్శ వినిపిస్తున్నది. Rita Sahu

బీజేపూర్ నేతల్లో ఇలా మారిన పార్టీ విధేయతలు
బీజేపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రణయ్ సాహు అభ్యర్థిత్వాన్నిఆ పార్టీ నాయకత్వం ఖరారు చేయడం కూడా దీనికి ఒక కారణమన్న అభిప్రాయం ఉంది. బార్పాలీ బ్లాక్‌లోని గోపైపల్లి గ్రామ సర్పంచ్ దాంబారుధర్ బిష్ణోయి తొలుత సుభాష్ సాహు విధేయుడిగా ఉన్నారు. తాజాగా తన విధేయతను బీజేడీకి మార్చేశారు. అభివ్రుద్ధి పనులు జరుగాలంటే బీజేడీతో కలిసి పని చేయాలని నిర్ణయానికి వచ్చామని బిష్ణోయి పేర్కొన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులుగా ఉన్న స్కూల్ టీచర్లు కూడా ఈ దపా బీజేపీకి బాసటగా నిలువాలని నిర్ణయించుకోవడం పరిస్థితిలో మార్పును తెలియజేస్తోంది.

బీజేపూర్‌లో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ.1,246 కోట్ల కేటాయింపు
కొద్ది నెలల క్రితం బీజేపూర్‌తోపాటు 70 పంచాయతీ బ్లాక్‌లకు సీఎం నవీన్ పట్నాయక్ కరువు సాయం ప్రకటించారు. బీజేపూర్ ప్రాంతంలో భూగర్భ జలాలు 200 మీటర్ల దిగువకు పడిపోయిన నేపథ్యంలో బీజేపూర్ బ్లాక్ పరిధిలో లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కోసం రూ.1,246 కోట్లు ప్రకటించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బార్గాఢ్‌లో రూ.750 కోట్ల వ్యయంతో ఇథనాల్ ప్రాజెక్టు నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

నవీన్ పట్నాయక్ ప్రజాదరణకు బీజేపూర్ ఫలితం ఒక గీటురాయి
పరీక్ష పే చర్చ' పేరుతో విద్యార్థులకు ప్రధాని నరేంద్రమోదీ చేసిన సలహాలతో బీజేపీ నాయకత్వం కూడా స్పూర్తి పొందింది. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కమలనాథులు బీజేపూర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికను పరీక్షగా భావించారు. బీజేపీ, బీజేడీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ హోరాహోరీ ప్రచారానికి దూరంగా ఉన్నది.
మరోవైపు సీఎం నవీన్ పట్నాయక్ తన ప్రజాదరణకు ఈ ఉప ఎన్నికను ఒక పరీక్షగా భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ స్థానాన్ని గెలిపించుకోవాలని ఆయన వ్యూహ రచన చేస్తున్నారు. తన ప్రత్యర్థులకు వ్యూహమేమిటో తెలియజేయాలని భావిస్తున్నారు.

బీజేపూర్‌లో త్రిముఖ పోటీ ఇలా
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చే ఎన్నికల్లో ఒడిశా సీఎం అభ్యర్థి అని భావిస్తున్నారు. దీనికి బీజేపూర్ ఉప ఎన్నిక ఫలితమే గీటు రాయి కానున్నది. ఒకవేళ బీజేపీ గెలుపొందకపోతే దర్మేంద్ర ప్రధాన్ సామర్థ్యాన్ని సమీక్షిస్తుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే సుభాష్ సాహు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్ని ప్రాంతాలు కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉన్న విషయాన్ని గుర్తించినందునే ఆయన భార్య రీతా సాహును పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు సీఎం నవీన్ పట్నాయక్. బీజేపీ తరఫున అశోక్ పాణిగ్రాహీ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రణయ్ సాహు బరిలోకిగారు.

స్థానిక నేతల మద్దతుపైనే కాంగ్రెస్ అభ్యర్థి ప్రణయ్ సాహూ ఆశలు
ఓలీవుడ్ స్లార్లు బీజేడీ, బీజేపీ తరఫున ప్రచారం చేస్తుండగా, కాంగ్రెస్ అభ్యర్థి ప్రణయ్ సాహు స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు నారాయణ్ సింగ్ మిశ్రా, నిరంజన్ పట్నాయక్, జయదేవ్ జెనా, శ్రీకాంత్ కుమార్ జెనా తదితరులపైనే ఆశలు పెట్టుకున్నారు. బీజేపూర్ అసెంబ్లీ స్థాన ఉప ఎన్నిక ఫలితం వచ్చే అసెంబ్లీ ఎన్నికల భవితవ్యాన్ని నిర్దేశిస్తుందన్నది వాస్తవం అని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!