ఆ సంచలన పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన సీజేఐ ఎన్వీ రమణ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసులో దోషులను గుజరాత్ ప్రభుత్వం- జైలు నుంచి విముక్తి కల్పించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ- దీనిపై చెలరేగిన వివాదాలు తగ్గుముఖం పట్టట్లేదు. మరింత ముదురుతోన్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అన్ని రకాలుగా నిరసనలు వ్యక్తమౌతోన్నాయి.

అల్లర్ల సందర్భంగా..
2002లో గోధ్రా రైలు దగ్ధం అనంతరం గుజరాత్‌లో చోటు చేసుకున్న అల్లర్ల సందర్భంగా బిల్కిస్ బానో అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె అయిదు నెలల గర్భిణి. ఆమె మూడేళ్ల కుమార్తె సహా ఏడుమంది కుటుంబ సభ్యులను అల్లరి మూకలు దారుణంగా హతమార్చాయి. ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాయి. ఈ కేసులో శిక్షను అనుభవిస్తోన్న వారిని స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుజరాత్ ప్రభుత్వం జైలు నుంచి విడిచిపెట్టింది. స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించింది.

11 మంది దోషుల విడుదల..
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో దోషులైన 11 మంది- రాధేశ్యామ్ షా, జశ్వంత్ చతుర్ భాయ్, కేశూభాయ్ వడానియా, బాకాభాయ్ వడానియా, రాజీభాయ్ సోని, రమేష్‌భాయ్ చౌహాన్, శైలేష్ భట్, బిపిన్ చంద్ర జోషి, గోవింద్‌భాయ్, మహేష్ భట్, ప్రదీప్ మోధియాకు 2008 జనవరి 21వ తేదీన సీబీఐ న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. బోంబే హైకోర్టు ఈ తీర్పును సమర్థించింది.

సన్మానాలతో..
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను పురస్కరించుకుని గుజరాత్ ప్రభుత్వం- వారిని సత్ప్రవర్తన గల ఖైదీలుగా గుర్తించి విడుదల చేసింది. సోమవారమే వారు జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు వారికి ఘన స్వాగతం పలికారు. పూలమాలలు వేసి సన్మానించారు. స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ నిర్ణయాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు సమర్థించారు. దోషులు బ్రాహ్మణులని, సత్ప్రవర్తనతో మెలగడం వల్లే విముక్తి కల్పించినట్లు వివరణ ఇచ్చారు.

ఆందోళనల్లో..
గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. అత్యంత దారుణకాండకు పాల్పడిన వారిని స్వేచ్ఛాయుత సమాజంలో విడిచి పెట్టడాన్ని స్వాగతించట్లేదంటూ పలువురు ప్రముఖులు స్పష్టం చేశారు. ఆరువేల మందికి పైగా రిటైర్డ్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, వేర్వేరు శాఖల్లో పని చేస్తోన్న ఉన్నతాధికారులు, విద్యావేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు, రచయితలు, చరిత్రకారులు, ఫిల్మ్‌మేకర్స్, జర్నలిస్టులు, మహిళా సంఘాల ప్రతినిధులు ఇదివరకే సుప్రీంకోర్టుకు విజ్ఞప్తులు పంపించారు.

పునఃసమీక్ష కోసం..
బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారికి జైలు నుంచి విముక్తి కల్పించడం సిగ్గుమాలిన చర్య అంటూ మండిపడ్డారు. ఊచకోతకు పాల్పడిన వారికి స్వేచ్ఛా జీవితాన్ని ప్రసాదించడం అర్థమే లేదని ధ్వజమెత్తారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని, గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. వారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు విజ్ఞప్తి చేశారు. సీజేఐని అడ్రస్ చేస్తూ ఈ జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేశారు.

పిటీషన్ వేసిన అపర్ణ భట్..
రేపిస్టుల విడుదల అంశాన్ని సీనియర్ అడ్వొకేట్ అపర్ణ భట్ ఈ ఉదయం సీజేఐ ఎన్వీ రమణ దృష్టికి తీసుకొచ్చారు. అత్యవసరంగా దీన్ని విచారించాలని కోరారు. మానవ హక్కులతో పాటు సత్ప్రవర్తన గల ఖైదీలను విడుదల చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన మార్గదర్శకాలు కూడా ఉల్లంఘనకు గురయ్యాయని పేర్కొన్నారు. దీనిపై సీజేఐ సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి వారికి క్షమాభిక్ష పెట్టారా? అని ప్రశ్నించారు. విచారణకు స్వీకరిస్తానని అన్నారు.












Click it and Unblock the Notifications