Today in Parliament: ఛార్టెడ్ అకౌంటెంట్స్, కంపెనీ యాక్ట్‌లల్లో కీలక సవరణలు: సభలో బిల్లులు
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో పలు కీలక బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో మొదలైన ఈ పరంపర కొనసాగుతోంది. పలు కీలక బిల్లులను సభ ఆమోదించింది. సెలెక్ట్ కమిటీకి పంపించినవి పరిమతంగా ఉంటోన్నాయి. ఎన్నికల వ్యవస్థలో విప్లవాత్మక మార్పుగా చెప్పుకోదగ్గ బిల్లును లోక్‌సభ సోమవారం ఆమోదించింది. ఓటర్ ఐడీ-ఆధార్ కార్డుకు అనుసంధానం చేసే బిల్లుకు ఆమోదం తెలిపింది.
ఇవ్వాళ మరిన్ని కీలక బిల్లులు ఉభయ సభల ముందుకు రానున్నాయి. చార్టెడ్ అకౌంటెంట్స్ యాక్ట్ 1949, ది కాస్ట్ అండ్ వర్క్స్ అకౌంటెంట్స్ యాక్ట్ 1959, కంపెనీ సెక్రెటేరియట్ యాక్ట్ 1980ల్లో సవరణలను చేస్తూ రూపొందించిన అమెండ్‌మెంట్స్ బిల్లులు ఇవ్వాళ సభ సమక్షానికి రానున్నాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ వాటిని ప్రవేశపెట్టనున్నారు. వాతావరణ మార్పులపైనా సభ ఇవ్వాళ చర్చించనుంది.

అదే సమయంలో- సవరణలు చేసిన రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1950, రెప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 రాజ్యసభ ముందుకు రానున్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు వాటిని సభలో ప్రవేశపెడతారు. ఈ రెండింటినీ ఇదివరకే లోక్‌సభ ఆమోదించింది. రాజ్యసభ ఆమోదం కోసం కిరణ్ రిజిజు తీసుకుని రానున్నారు. వీటన్నింటిపైనా ఉభయ సభల్లో ఎలాంటి చర్చలు సాగుతాయి?, ఈ బిల్లులు ఆమోదం పొందుతాయా? లేవా? అనేది ఆసక్తికరంగా మారింది.
కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అధిపతుల పదవీ కాలాన్ని గరిష్ఠంగా అయిదు సంవత్సరాల పాటు పొడిగించేలా రూపొందించిన బిల్లు ది ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎష్టాబ్లిష్‌మెంట్ (అమెండ్‌మెంట్) బిల్లు 2021, ది సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (అమెండ్‌మెంట్) బిల్లు 2021 సభ ముందుకొచ్చాయి. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ల పదవీ కాలాన్ని అయిదేళ్ల పాటు పొడిగించాలని ఇదివరకే కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రూపొందించిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
కాగా- ఉభయ సభల్లోనూ ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్యుద్ధం కొనసాగుతూనే వస్తోంది. ప్రత్యేకించి- రాజ్యసభలో పతాక స్థాయిలో దీనిపై వాగ్వివాదం నడుస్తోంది. వేర్వేరు పార్టీలకు చెందిన 12 మంది సభ్యులను సస్పెన్షన్ చేయడాన్ని నిరసిస్తూ రాజ్యసభలో ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనను వ్యక్తం చేస్తూ వస్తోన్నారు. సస్పెన్షన్ ఎత్తేసేంత వరకూ కొనసాగిస్తామని స్పష్టం చేస్తోన్నారు. ఇవ్వాళ కూడా అదే పరిస్థితి సభలో కనిపించే అవకాశం లేకపోలేదు.












Click it and Unblock the Notifications