తమిళనాడు బీజేపీ ఛీఫ్ పేరు ఖరారు..! వానతీ, తమిళిసైని కాదని..
అన్నామలై రాజీనామాతో ఖాళీ అయిన తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిపై పార్టీ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చింది. ఇప్పటికే పార్టీలో సీనియర్ మహిళా నేతలు వానతీ శ్రీనివాసన్, తమిళిసై సౌందర రాజన్ ను కాదని ఎమ్మెల్యేగా ఉన్న నైనార్ నాగేంద్రన్ కు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఢిల్లీ స్ధాయిలో నిర్ణయం తీసుకున్నారు. దీన్ని త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు. తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సమావేశం తర్వాత ఇవాళ సాయంత్రం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నైనార్ నాగేంద్రన్ పేరుపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. తిరునల్వేలికి చెందిన తేవర్ సామాజిక వర్గ నేత, రాష్ట్రంలో బిజెపి శాసనసభా పక్ష నాయకుడు కూడా ఉన్న నాగేంద్రన్ పై పార్టీ అధిష్టానానికి బాగా గురి ఉన్నట్లు తెలుస్తోంది. నైనార్ ఇవాళ మధ్యాహ్నం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేస్తారని తెలుస్తోంది. ఇతరులు కూడా ఆయన తరపున దాఖలు చేయనున్నారు.

బీజేపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం వానతి శ్రీనివాసన్, మాజీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళిసై సౌందరరాజన్ వంటి ఇతర పేర్లపై ఊహాగానాలు వచ్చినా ఈ పదవికి తీవ్రమైన పోటీ అయితే లేదని తెలుస్తోంది. నైనార్ నాగేంద్రన్ ను ఎంపిక చేయాలని ఢిల్లీలో పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుందని, కాబట్టి దీనిపై రాష్ట్రంలో అభ్యంతరాలు ఉండకపోవచ్చని సమాచారం.
ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో బీజేపీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. గతంలో అన్నాడీఎంకే విడిపోయిన తర్వాత బీజేపీ పరిస్ధితి రాష్ట్రంలో తీసికట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఎన్నికలు ఎదుర్కోవడం పార్టీకి కత్తిమీద సాముగా మారుతోంది. గెలుపు సంగతి అటుంచి ఉనికి చాటుకుంటే చాలని కాషాయ శిబిరం భావిస్తోంది.












Click it and Unblock the Notifications