బీజేపీకి షాకిచ్చిన నితీష్ కుమార్: పెగాసస్ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్
న్యూఢిల్లీ/పాట్నా: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పెగాసస్ హ్యాకింగ్ వ్యవహారంపై దర్యాప్తు జరపాలని విపక్ష పార్టీలు డిమాండ్ చేస్తుండగా.. ఆ జాబితాలోకి ఇప్పుడు బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా చేరింది. పెగాసస్‌పై అన్ని విషయాలను బయటపెట్టాలని తాజాగా జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు.
ప్రజలను వేధించేందుకు ఇలాంటివి చేయకూడదని నితీష్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్‌పై కొద్ది రోజులుగా చర్చ నడుస్తోందని, దీన్ని పార్లమెంటులో కూడా లేవనెత్తారని చెప్పారు. మీడియాలో అనేక కథనాలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. ప్రజల్ని వేధించే ఇలాంటి అంశాన్ని ఖచ్చితంగా పరిశీలించాలని, అన్ని వివరాలు వెల్లడించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

పెగాసస్ వ్యవహారంపై మీడియా అడిగిన ప్రశ్నకు నితీష్ కుమార్ ఈ మేరకు స్పందించారు. పెగాసస్ వ్యవహారంపై విచారణ జరపాలంటూ పార్లమెంటులో కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పార్లమెంటు ఉభయసభల్లో ఆందోళనలు, నిరసనలు చేపడుతున్నారు.
పార్లమెంటులో పెగాసస్ వ్యవహారంపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబట్టునప్పటికీ ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ వివాదంపై దర్యాప్తు అవసరం లేదని, అసలు ఫోన్ ట్యాపింగ్ వంటిదేమీ జరగడం లేదని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఫోన్ ట్యాపింగే జరగనప్పుడు విచారణ జరపడం ఎందుకని ప్రశ్నించింది.
పెగాసస్ వ్యవహారంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలకు ఇప్పుడు బీజేపీ మిత్రపక్షమైన జేడీయూ నేత నితీష్ కుమార్ మద్దతు పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది బీజేపీ సర్కారును కొంత ఇరకాటంలోకి నెట్టినట్లేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు పెగాసస్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఈ వారంలో దీనిపై విచారణ జరిగే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications