ఢిల్లీపై బీజేపీ ట్విస్ట్, కాంగ్రెస్‌తో కేజ్రీవాల్ రహస్యంగా..!
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భారతీయ జనతా పార్టీ విముఖత చూపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మళ్లీ ఎన్నికలకు వెళ్లడమే మంచిదిగా భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీ బీజేపీ నేతలను బుజ్జగించినట్లుగా చెబుతున్నారు.
ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటు పైన లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ దృష్టి సారించారు. ప్రభుత్వ ఏర్పాటు సాధ్యాసాధ్యాల పైన లెప్టినెంట్ గవర్నర్ సోమవారం సాయంత్రం బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. ఈ భేటీలో తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సుముఖంగా లేమని బీజేపీ తేల్చి చెప్పనుందని తెలుస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం, ఇటీవల మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల గెలుపు నేపథ్యంలో ఢిల్లీలోను ఎన్నికలకు వెళ్లడమే మంచిదని అమిత్ షా భావిస్తున్నారని సమాచారం. అయితే, బీజేపీ వ్యూహాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఆ రెండు పార్టీలు రహస్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే విషయమై చర్చించుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ ప్రతిపాదిస్తే, బీజేపీ దానిని తిరస్కరిస్తే... తాము కలిసి ఏర్పాటు చేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చూస్తున్నాయని తెలుస్తోంది. ఇందు కోసం రహస్యంగా చర్చలు జరుపుతున్నాయని చెబుతున్నారు. ఇదిలా ఉండగా, ఢిల్లీలో బీజేపీ అల్లర్లను ప్రోత్సహిస్తోందని అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. గ్రామీణ ఢిల్లీలో బీజేపీ విద్వేష రాజకీయాలను తిప్పికొట్టారని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
కాగా, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు ఢిల్లీ ఎన్నికల పైన సవాల్ విసురుతున్న విషయం తెలిసిందే. బీజేపీకి దమ్ముంటే ఢిల్లీలో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని అరవింద్ కేజ్రీవాల్ పలుమార్లు సవాల్ విసిరారు. బీజేపీ మళ్లీ ఎన్నికలకు సుముఖంగా లేదని ఆయన ఆరోపించారు. అయితే, ఇప్పుడు బీజేపీ ఎన్నికలకు సమాయత్తమయ్యేందుకు సిద్ధం కావడం గమనార్హం.
2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాలేదు. అయితే, బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. 28 స్థానాలతో రెండో స్థానంలో ఉన్న ఏఏపీ, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అనంతరం కేజ్రీవాల్ కేవలం 49 రోజులు పాలించి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుండి ఢిల్లీ విషయంలో ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications