ఖర్గే, ఆయన కుమారుడి హత్యకు కుట్ర: బీజేపీ అభ్యర్థికి డీల్: ఆడియో క్లిప్
బెంగళూరు: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల గడువు సమీపిస్తోన్న నేపథ్యంలో- ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచార తీవ్రతను పెంచాయి. విజయం సాధించడానికి నియోజకవర్గ స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోన్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి.
భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ జాతీయ స్థాయి నాయకులు కర్ణాటకలో మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడుపుతోన్నారు. అటు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ, జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా సంచలన ప్రకటన చేశారు. ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, ఆయన కుమారుడు ప్రియాంక్ ఖర్గేలను హత్య చేయడానికి బీజేపీ కుట్ర పన్నిందంటూ ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే కుటుంబం మొత్తాన్ని మట్టుబెట్టడానికి పథకం పన్నిందని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారాయన.
బెంగళూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుర్జేవాలా మాట్లాడారు. దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు. మల్లికార్జున ఖర్గే, ప్రియాంక్ ఖర్గే సహా ఆయన కుటుంబాన్ని చంపడానికి బీజేపీ ప్లాన్ చేసిందని, ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కలబురగి జిల్లాలోని చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తోన్న మణికంఠ రాథోడ్‌తో డీల్ కుదుర్చుకుందని విమర్శించారు.
బీజేపీ సీనియర్ నాయకులతో మణికంఠ రాథోడ్ సాగించిన సంభాషణలు దీనికి నిదర్శనమని చెప్పారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి మణికంఠ రాథోడ్ అత్యంత ఆప్తుడని సుర్జేవాలా చెప్పారు. రాథోడ్‌కు నేరచరిత్ర ఉందని, వివిధ పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదై ఉన్నాయని ధ్వజమెత్తారు. మల్లికార్జున ఖర్గే, ఆయన కుటుంబాన్ని ఫినిష్ చేయాలంటూ ఆడియో క్లిప్‌లో స్పష్టంగా రికార్డయిందనీ సుర్జేవాలా తెలిపారు.
ఈ ఎన్నికల్లో- ఇదే చిత్తాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక్ ఖర్గే పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ స్థానం నుంచి మల్లికార్జున ఖర్గే ఒకసారి, ప్రియాంక్ ఖర్గే రెండుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పుడాయన మరోసారి ఇదే స్థానం నుంచి ఎన్నికల బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో కూడా ఆయనే గెలుస్తారని, అందుకే ఖర్గే కుటుంబాన్ని ఫినిష్ చేయాలంటూ బీజేపీ నాయకత్వం ఆదేశించిందని సుర్జేవాలా ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications