బీజేపీ చేస్తోంది అదే: జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర విమర్శలు
రాంచీ: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జేఎంఎం నేత, సీఎం హేమంత్ సోరెన్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటోందని బీజేపీపై మండిపడ్డారు. రాష్ట్రంలో కాషాయ పార్టీ మతతత్వ విషాన్ని వ్యాపింపజేస్తోందని హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఖుంతి జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన ప్రసంగించారు.
రాష్ట్రంలో బీజేపీ ఏమీ చేయలేదని అన్నారు హేమంత్ సోరెన్. ఇక్కడి భూమి, కూతురు, రోటితో బీజేపీకి సంబంధం లేదన్నారు. రాష్ట్రంలోని వనరులపైనే బీజేపీకి ఆసక్తి ఉందని ఆరోపించారు. ఓ కమ్యూనిటీని లక్ష్యంగా చేసుకుందని బీజేపీపై హేమంత్ సోరెన్ విమర్శలు గుప్పించారు.

కాగా, బంగ్లాదేశీ అక్రమ వలసదారులతో జార్ఖండ్‌లోని భూమి, రోటి, బేటీ(స్త్రీల)కి ప్రమాదం పొంచివుందని బీజేపీ నేతలు పలు ఎన్నికల ప్రచారంలో వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హేమంత్ సోరెన్ బీజేపీపై ఈ మేరకు విమర్శలు ఎక్కుపెట్టారు. జార్ఖండ్ రాష్ట్రంలోని బంగ్లాదేశీ అక్రమ వలసదారుల గురించి మాట్లాడుతున్న అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ.. మణిపూర్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడుల గురించి ఎందుకు మాట్లాడటం లేదని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో మత విద్వేషాలను బీజేపీ నేతలు రెచ్చగొడుతున్నారని హేమంత్ సోరెన్ ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గనులను తమ స్నేహితులకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించిన హేమంత్ సోరెన్.. దీంతో గిరిజనులు అడవికి దూరమవుతున్నారని అన్నారు. బీజేపీ.. జల్, జంగిల్, జమీన్ పై కన్నేసిందని సోరెన్ ఆరోపించారు.
జార్ఖండ్ రాష్ట్రంలో రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని బీజేపీ ప్రకటించిందని.. వారు అధికారంలో ఉన్న అస్సాం, ఛత్తీస్‌గఢ్, బీహార్ రాష్ట్రాల్లో ఇస్తున్నారా? అని హేమంత్ సోరెన్ ప్రశ్నించారు. ప్రజల జేబుల్లోంచి వస్తువులు దొంగిలించే పిక్‌పాకేటర్ల లాగా బీజేపీ వ్యవహరిస్తుందని సోరెన్ ఆరోపించారు.
కాగా, జార్ఖండ్‌లో 2024 అసెంబ్లీ ఎన్నికలు రెండు దశల్లో జరగనున్నాయి. మొదటి దశ పోలింగ్ నవంబర్ 13న 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనుండగా, రెండో దశ 38 స్థానాల్లో నవంబర్ 20న జరగనుంది. నవంబర్ 23న ఓట్ల లెక్కింపు, ఫలితాలు వెలువడనున్నాయి.












Click it and Unblock the Notifications