బీజేపీకి నూతన అధ్యక్షుడు - మోదీ మార్క్ ఎంపిక..!!
మహారాష్ట్ర విజయం తరువాత బీజేపీ రూటు మార్చింది. రాజకీయంగా వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. జమిలి దిశగా కసరత్తు చేస్తున్న వేళ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మహారాష్ట్ర సీఎం ఖరారు వెనుక కొత్త వ్యూహాలు తెర మీదకు వస్తున్నాయి. బీజేపీకి నడ్డా స్థానంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక పైన మోదీ - షా ద్వయం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా అనూహ్య నిర్ణయాల దిశగా అడుగులు పడుతున్నాయి. బీజేపీకి కొత్త అధ్యక్షుడు.. మహారాష్ట్ర నూతన సీఎం పైన ఈ ఇద్దరు ఒక అంచనాకు వచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది.
కొత్త అధ్యక్షడుయ్యేదెవరు
మహారాష్ట్ర నూతన సీఎం ఎంపిక వెనుక భారీ స్కెచ్ కనిపిస్తోంది. ఏకపక్షంగా మహారాష్ట్రలో విజయం సాధించిన బీజేపీ అక్కడ సీఎం ఖరారు తో పాటుగా పార్టీ లో కీలక నియామకాల పైన చర్చ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మహారాష్ట్ర సీఎం పదవి బీజేపీకే దక్కుతుందని షిండే, అజిత్ పవార్ కు అమిత్ షా తేల్చి చెప్పారు. షిండే సైతం తాను సీఎం పదవి ఆశించటం లేదని ప్రకటించారు. ఎవరు సీఎం అయినా అజిత్ పవార్ డిప్యూటీ కావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు బీజేపీ నుంచి మాజీ సీఎం ఫడ్నవీస్ కు మరోసారి సీఎంగా అవకాశం దక్కుతుందని పార్టీ నేతలు భావిస్తూ వచ్చారు.

మోదీ - షా కసరత్తు
కానీ, మోదీ - షా కొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా మహారాష్ట్ర సీఎంగా కేంద్ర సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ పేరు పరిశీలనలోకి వచ్చింది. మురళీధర్ మోహోల్ పూణే ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతు న్నారు. గతంలో పుణె మేయర్‌గా మురళీధర్ వ్యవహరించారు. రాజకీయ వర్గాల్లో పెద్దగా ప్రచారం లో లేని మురళీధర్‌ను బీజేపీ అగ్రనాయకత్వం మహారాష్ర్ట సీఎంగా పరిశీలన చేస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీంతో, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు బీజేపీ జాతీయ అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కొత్త అంచనాలు తెర మీదకు వచ్చాయి.

బీజేపీ కొత్త లెక్కలు
పార్లమెంట్ ఎన్నిక లు పూర్తయిన తరువాత ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు నడ్డా స్థానంలో కొత్త చీఫ్ నియామకం పైన పలు పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. అయితే, పార్టీకి విధేయుడుగా ఉండటంతో పాటుగా సంకీర్ణ కూటమి ని నిర్వహించటంలో ఫడ్నవీస్ సక్సెస్ అయ్యారు. ఆరెస్సెస్ మద్దతు ఉండటం ఫడ్నవీస్ కు కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మరో రెండు నెలల కాలంలో ఢిల్లీతో పాటుగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా జమిలి పైన బీజేపీ నాయకత్వం కసరత్తు చేస్తోంది. ఈ సమయంలో బీజేపీకి కొత్త అధ్యక్షుడి ఎంపిక త్వరగా పూర్తి చేయాలని పార్టీ భావిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఫడ్నవీస్ పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే మహారాష్ట్ర సీఎం..బీజేపీ నూతన అధ్యక్షుడిని ఖరారు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications