మోడీ ఎఫెక్ట్: కాశ్మీర్, జార్ఖండ్ ఎన్నికల్లోను బీజేపీ హవా!
న్యూఢిల్లీ: జార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మేజిక్ ఫిగర్ రాకపోవచ్చునని ఒపీనియన్ సర్వే చెబుతోంది. జార్ఖండ్ శాసన సభ ఎన్నికల్లో ఎనభై ఒక్క స్థానాలకు గాను, బీజేపీకి 29 నుండి 35 సీట్లను గెలుచుకునే అవకాశముందని ఇండియా టీవీ-సీ జరిగిన ఓటరు పోల్ సర్వేలో వెల్లడైంది.
జమ్ము కాశ్మీర్‌లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపింది. 87 స్థానాలున్న జమ్మూ కాశ్మీర్‌లో పీడీపీకి 27 నుండి 33 స్థానాలు, భారతీయ జనతా పార్టీకి 23 నుండి 29 స్థానాలు రావొచ్చునని ఆ సర్వే పేర్కొంది.
నేషనల్ కాన్ఫరెన్స్ 10-16, కాంగ్రెస్ 6-12 గెలుచుకోవచ్చునని తెలిపింది. 2009 ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ 28 సీట్లు, కాంగ్రెస్ 17 సీట్లు, పీడీపీ 21 సీట్లు, బీజేపీ 11 సీట్లు గెలుచుకుంది.

ముఖ్యమంత్రి అభ్యర్థిగా పీడీపీ నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్‌కు 53 శాతం మంది మద్దతు పలికారు. జార్ఖండ్ విషయానికి వస్తే అధికార పార్టీ ముఖ్య నేత హేమంత్ సోరెన్‌కు 41 శాతం మద్దతు పలికారు. 2009లో జెఎంఎం, బీజేపీలు చెరో 18 స్థానాలు, కాంగ్రెస్ 14, జీవీఎం 11 సీట్లు గెలుచుకుంది.
కాగా, ఢిల్లీ శాసన సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేని ఆధిక్యం వస్తుందని సర్వేలు చెబుతున్నాయు. ఏబీపీ న్యూస్ - నీల్సన్ ఒపీనియన్ పోల్ నిర్వహించింది. ఇందులో బీజేపీ మేజిక్ ఫిగర్ దాటుతుందని తేలింది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవాతో బీజేపీ 46 స్థానాలు గెలుచుకోవచ్చునని ఈ సర్వే తెలిపింది. ఆమ్ ఆద్మీ పార్టీకి 18 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు దక్కవచ్చునని తెలిపింది.
ఈ సర్వే ప్రకారం ముఖ్యమంత్రిగా సమర్థుడైన వ్యక్తిగా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు 39 శాతంమంది మద్దతు పలికారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి హర్షవర్ధన్‌కు 38 శాతం మంది మద్దతు పలికారు. వీరిద్దరు మొదటి రెండో స్థానాల్లో నిలిచారు.












Click it and Unblock the Notifications