అద్వానీకి షాక్: ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరుకే రెడీ
న్యూఢిల్లీ: అగ్రనేత ఎల్‌కె అద్వానీ అంగీకారంతో పని లేకుండా నరేంద్ర మోడీ పేరును ప్రధాని అభ్యర్థిగా ప్రకటించేందుకు బిజెపి నాయకత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ప్రధాని అభ్యర్థిగా మోడీని అంగీకరించడానికి అద్వానీ నిరాకరిస్తున్నారు. అయితే, అద్వానీ తిరస్కరణకు ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ ఎవరు కూడా అసంతృప్తిగా లేరని బిజెపి అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
అద్వానీని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలన్నీ విఫలమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన అభిప్రాయంతో ప్రమేయం లేకుండా సాధ్యమైనంత త్వరగా ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరును ప్రకటించడానికి బిజెపి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ నుంచి బిజెపికి సూచనలు అందినట్లు తెలుస్తోంది.

ప్రధాని అభ్యర్థిగా మోడీ పేరుపై ఏకాభిప్రాయ సాధనకు పార్టీలో విస్తృతమైన చర్చలు జరిగాయి. పార్టీ సీనియర్ నేత అనంత కుమార్ సుష్మా స్వరాజ్‌ను ఒప్పించడానికి ప్రయత్నించారు. మోడీ అభ్యర్థిత్వంపై ఆమెకు కూడా కొన్ని పరిమితులున్నాయి. రాజ్‌నాథ్ సింగ్ సుష్మా స్వరాజ్‌తో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.
మోడీ అభ్యర్థిత్వంపై ఎవరికీ అసంతృప్తి లేదని, ఎవరు కూడా షరతులు పెట్టలేదని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. పార్లమెంటరీ పార్టీ సమావేశం ఎప్పుడు జరిగేది మీడియాకు తెలియజేస్తామని ఆయన చెప్పారు. రాజ్‌నాథ్ సింగ్ అద్వానీతో బుధవారం అర గంట పాటు సమావేశమయ్యారు. గాంధీనగర్‌లో ఉన్న ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌ను నరేంద్ర మోడీ కలిసే అవకాశాలున్నాయి.
సెప్టెంబర్ 17వ తేదీలోగా పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి మోడీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. మోడీ అభ్యర్థిత్వంపై అద్వానీ మౌనం వహిస్తుండగా, ఆయన సన్నిహిత అనుచరుడు సుధీంద్ర కులకర్ణి మోడీపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
బీహార్‌కు చెందిన బిజెపి నాయకుడు సుశీల్ కుమార్ మోడీ అద్వానీపై విమర్శలు కురిపించారు. ప్రజల మనోభావాలను గుర్తించడంలో అద్వానీ విఫలమయ్యారని ఆయన విమర్శించారు. అటల్ బిహారీ పేరును అద్వానీ స్వయంగా ప్రకటించారని, నరేంద్ర మోడీ విషయంలోనూ అద్వానీ అదే చేయాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications