తిరిగి భవానీపూర్ నుంచి బరిలోకి మమత-బీజేపీ నుంచి ఆగని వలసలు-టీఎంసీకి ఫుల్ జోష్
పశ్చిమబెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత మొదలైన బీజేపీ ఎమ్మెల్యేల వలసల పర్వం నిరాకంటంగా కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకూ అధికార తృణమూల్ కాంగ్రెస్ లో ఉండి ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గెలిచిన వారంతా ఇప్పుడు తిరుగుముఖం పడుతున్నారు. ఇదే కోవలో ఇవాళ బీజేపీకి చెందిన మరో ఎమ్మెల్యే సౌమేన్ రాయ్ తిరిగి టీఎంసీలో చేరిపోయారు.
బెంగాల్లోని కలియాగంజ్ నియోజకవర్గం నుంచి గతంలో తృణమూల్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన సౌమేన్ రాయ్ తాజాగా ఎన్నికలకు ముందు బీజేపీలో చేరి గెలిచారు ఇవాళ ఆయన తిరిగి బీజేపీని వీడి టీఎంసీ తీర్ధం పుచ్చుకున్నారు. బెంగాల్ తో పాటు ఉత్తర బెంగాల్ అభివృద్ధి కోసమే సౌమేన్ సేన్ తిరిగి తమ పార్టీలో చేరినట్లు టీఎంసీ నేత పార్ధా ఛటర్జీ తెలిపారు. బెంగాల్ సంస్కృతీ సంప్రదాయాలు కాపాడటమే ఆయన లక్ష్యమన్నారు.

సౌమేన్ రాయ్ టీఎంసీలో తిరిగి చేరడంతో బెంగాల్ అసెంబ్లీలో బీజేపీ బలం 71కి పడిపోయింది. గత నెల రోజుల్లో నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలు టీఎంసీలోకి ఫిరాయించారు. వాస్తవానికి ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ ఎమ్మెల్యేల రాజీనామాలతో ఖాళీ అయిన షంషేర్ గంజ్, జాంగీపూర్, భవానీ పూర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది అయితే విచిత్రంగా ఇవాళే మరో బీజేపీ ఎమ్మెల్యే టీఎంసీలోకి ఫిరాయించారు.
ఇవాళ ఎన్నికల కమిషన్ ప్రకటించిన మూడు స్ధానాల్లో ఒకటైన భవానీపూర్ ఉపఎన్నికలో సీఎం మమతా బెనర్జీ పోటీ చేయబోతున్నారు. గతంలో పలుమార్లు గెలిచిన ఇక్కడి నుంచి తిరిగి మమత ఈసారి గెలుపు కూడా లాంఛనంగానే కనిపిస్తోంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీలో చేరిన తమ పార్టీ నేత సువేందు అధికారిపై నందిగ్రామ్ లో పోటీ చేసి ఓటమిపాలైన మమత.. ఈసారి తన సొంత నియోజకవర్గం భవానీపూర్ నుంచి తిరిగి అసెంబ్లీలో అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆమె త్వరలో నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. నందిగ్రామ్ లో ఓటమి తర్వాత ఎమ్మెల్సీ కావడం ద్వారా చట్టసభల్లో అడుగుపెట్టాలని భావించినా ఇప్పటికిప్పుడు అవకాశం లేకపోవడంతో భవానీపూర్ లో సొంత పార్టీ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి అక్కడి నుంచి ఆమె పోటీ పడుతున్నారు.












Click it and Unblock the Notifications