"మోదీకి బీజేపీ అవసరం లేదు.. బీజేపీ మనుగడకే మోదీ అవసరం"
ప్రధాని నరేంద్ర మోదీకి భారతీయ జనతా పార్టీ అవసరం లేదని.. ఆయన ప్రపంచ ఖ్యాతి సాధించారని బీజేపీకే మోదీ అవసరం ఉందని బీజేపీ నేత, ఎంపీ నిశికాంత్ దూబే కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మనుగడ మోదీ మీదనే ఆధారపడి ఉందన్నారు. 2029 లోక్ సభ ఎన్నికల్లో మోదీ లేకుండా బీజేపీ బరిలో దిగితే 150 సీట్ల కంటే ఎక్కువ రావని కుండ బద్దలు కొట్టారు నిశికాంత్ దూబే.
గొడ్డా ఎంపీ, బీజేపీ నేత నిశికాంత్ దూబే సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ లేకుండా బీజేపీ మనుగడ లేదని అన్నారు. మోదీకి భారతీయ జనతా పార్టీ అవసరం లేదని.. బీజేపీకే మోదీ అవసరం ఉందన్నారు. దిల్లీలో ఓ ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే 15-20 ఏళ్ల వరకూ మోదీ బీజేపీలో క్రీయాశీలకంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. మోదీ లేకుండా భారతీయ జనతా పార్టీని ఊహించుకోలేమన్నారు. అంతేకాక ప్రధాని మోదీ లేకుండా 2029 పార్లమెంటరీ ఎన్నికల్లో బరిలోకి దిగితే బీజేపీకి 150 సీట్లు కంటే ఎక్కువ రావని తేల్చి చెప్పారు. ఆయన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మాట్లాడుతూ.. రిటైర్మెంట్ పై మరాఠా సామ్రాజ్య మొదటి పీష్వా, సంఘ్ సిద్ధాంతకర్త మోరోపంత్ పింగ్లే చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. 75 ఏళ్ల శాలువా మన మీద కప్పారంటే, మనం ఒక నిర్దిష్ట వయస్సుకు చేరుకున్నామని అర్థం అన్నారు. అప్పుడు మనం కాస్త పక్కకు జరిగి, వేరే వాళ్లకు పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలని తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి. దీంతో కాంగ్రెస్ ప్రధాని మోదీపై విమర్శలు చేసింది. మోదీకి ఈ ఏడాది 75 ఏళ్లు నిండనున్నాయని.. మోదీని ఉద్దేశించే భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ ఎద్దేవా చేసింది. అయితే ప్రధాని మోదీ, భగవత్ ఇద్దరికీ సెప్టెంబర్ లో 75 ఏళ్లు నిండుతాయి.
ఇక బీజేపీ నేత నిశికాంత్ దూబే మాట్లాడతూ.. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ.. బంగ్లాదేశ్ ను ఏర్పాటు చేసి తప్పుచేశారని అన్నారు. ఈ నిర్ణయం వల్ల భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లించుకుంటూనే ఉందన్నారు. మనం హిందూ బంగ్లాదేశ్, ముస్లిం బంగ్లాదేశ్ విడిగా ఏర్పాటు చేయాల్సిందని తన అభిప్రాయం తెలిపారు.












Click it and Unblock the Notifications