సర్వే: మూడు రాష్ట్రాల్లో మోడీ హవా, కర్ణాటకలోనూ
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న లోకసభ ఎన్నికల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ గుజరాత్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో స్వీప్ చేయనుందని, మహారాష్ట్రలో ఎన్డిఏ కూటమి మూలంగా కాంగ్రెస్-ఎన్సిపి కూటమికి భారీ దెబ్బ తగలనుందని గురువారం విడుదల చేసిన ఎన్డిటివి-హన్స రీసెర్చ్ ప్రి పోల్ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను 12 రాష్ట్రాల్లోని 319 లోకసభ స్థానాల్లో నిర్వహించారు.
సర్వే ప్రకారం.. 319 స్థానాల్లో బిజెపి నాయకత్వంలోని ఎన్డిఏ కూటిమికి 166, కాంగ్రెస్‌కు సంబంధించిన యుపిఏ కూటమికి 52, ఇతరులకు 85 స్థానాలు వచ్చే అవకాశం ఉంది. ఏఐడిఎంకె 39 స్థానాల్లో పోటీ చేస్తే 27 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. డిఎంకెకు 10 స్థానాలు దక్కే అవకాశం ఉంది. అదే విధంగా మహారాష్ట్రలో బిజెపి-శివసేన కూటమి 48 స్థానాలనకు గానూ 33 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉండగా.. కాంగ్రెస్ 12 స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. 2009 ఎన్నికలతో పోలిస్తే 13 స్థానాలను కాంగ్రెస్ కోల్పోనుంది.

రాజ్‌థాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేనకు ఒక లోకసభ స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. కాగా, గుజరాత్ రాష్ట్రంలోని 26 లోకసభ స్థానాలకు గానూ 23 స్థానాలను, కర్ణాటకలోని 28 స్థానాల్లో 21 స్థానాలను బిజెపి కైవసం చేసుకునే అవకాశం ఉంది. బిజెపి ప్రభుత్వ పాలనలో ఉన్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 29 స్థానాల్లో 24 స్థానాలను బిజెపి కైవసం చేసుకోనుందని సర్వే వెల్లడించింది. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా బిజెపి అత్యధిక స్థానాలను చేజిక్కించుకునే అవకాశం ఉంది.
అదే విధంగా బీహార్ రాష్ట్రంలో ని 40 స్థానాల్లో బిజెపి-ఎల్జెపి కూటమికి 23 స్థానాలు దక్కే అవకాశం ఉండగా.. కాంగ్రెస్-ఆర్జెడి కూటమి 11, జెడియు 5 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాళ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 42 లోకసభ స్థానాలున్న ఆ రాష్ట్రంలో 32 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. వామపక్ష పార్టీలకు 9 స్థానాలు, కాంగ్రెస్ పార్టీకి 1 స్థానం దక్కే అవకాశం ఉంది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 28 స్థానాలు దక్కించుకుని సంచలనం సృష్టించిన ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలోని 7 లోకసభ స్థానాల్లో 4, బిజెపి 2, కాంగ్రెస్ 1 స్థానం దక్కే అవకాశం ఉంది. ఈ సర్వే ప్రకారం భారతదేశంలోని 42 శాతం మంది ప్రజలు నరేంద్ర మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఆయన తర్వాత 27శాతం ప్రజల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ద్వితీయ స్థానంలో ఉన్నారు.












Click it and Unblock the Notifications