యూపీఎస్సీ పరీక్షలో బెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న: బీజేపీపై మమతా బెనర్జీ ఫైర్, కంటతడి
కోల్ కతా: పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సేవల కోసం నిర్వహించిన పరీక్షల్లో బీజేపీ అడగమన్న ప్రశ్నలే అడుగుతోందని, ఈ చర్యలు దాని పునాదిని బలహీనపరుస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ కన్నీటిపర్యంతమయ్యారు.
సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్‌లో సివిల్, సాయుధ పోలీసుల ఉద్యోగాల కోసం నిర్వహించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) పరీక్షలో పశ్చిమబెంగాల్ ఎన్నికల హింసపై ప్రశ్న అడిగారు. ఈ విషయంపైనే మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ రాష్ట్ర పరువు ప్రతిష్టలకు బీజేపీ తీవ్ర నష్టం కలిగిస్తుందంటూ మమతా బెనర్జీ కన్నీరుపెట్టుకున్నారు. బీజేపీ అడగమన్న ప్రశ్నలనే యూపీపీఎస్సీ అడుగుతున్నదని ధ్వజమెత్తారు.

'బీజేపీ సూచించిన ప్రశ్నలనే యూపీపీఎస్సీ అడుగుతుంది. యూపీపీఎస్సీ నిష్పక్షపాతంగా ఉండేది. కానీ, ప్రస్తుతం బీజేపీ తాను అడగాలనుకున్న ప్రశ్నలను యూపీపీస్సీ బోర్డు చేత అడిగిస్తోంది. అలాగే యూపీపీఎస్సీ పేపర్‌లో రైతుల నిరసనపై ప్రశ్న కూడా రాజకీయ ప్రేరేపితమే' అని మమతా బెనర్జీ ఆరోపించారు. యూపీపీఎస్సీ లాంటి సంస్థలను బీజేపీ నాశనం చేస్తుందని విమర్శించారు.
కాగా, మమతా బెనర్జీ పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో కరోనా ఆంక్షలను సడలిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగానే కేంద్రంపై విమర్శలు చేశారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పెద్ద ఎత్తున హింస చెలరేగిన విషయం తెలిసిందే. బీజేపీ కార్యాలయాలపై దాడులు జరిగాయి. పలువురు బీజేపీ నేతలపైనా దాడులు చేశారు. బీజేపీ నేతలు, హిందువులపై టీఎంసీ గూండాలే దాడులకు పాల్పడి భయభ్రాంతులకు గురిచేశారంటూ బీజేపీ నేతలు మమతా బెనర్జీపై మండిపడ్డారు. అయితే, చిన్న గొడవలను పెద్దవిగా చేసి చూపిస్తోందని టీఎంసీ ఖండించింది.
ఇది ఇలావుండగా, పశ్చిమబెంగాల్‌లోని ఏడు అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబరులో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఉప-ఎన్నికల విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ త్వరలో తుది నిర్ణయం తీసుకోనుందని తెలుస్తోంది. భవానిపుర్, ఖ్రాడా, శాంతిపుర్, దిన్హాటా, గోసబా, సంసెర్గుంజ్, జాంగిపుర్ శాసనసభ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగాల్సి ఉంది.
బెంగాల్‌లో విశ్వకర్మ పూజ ముగిసిన వెంటనే ఎన్నికలు జరుగుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికలకు సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనికి ముందు రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి గురించి సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఓ లేఖ రాసింది. దీనిపై స్పందించింది రాష్ట్ర ప్రభుత్వం. కరోనావైరస్ నియంత్రణలో ఉందని, అందువల్ల ఉప ఎన్నికలను నిర్వహించడంలో ఎలాంటి సమస్య ఉండదని మమత సర్కారు పేర్కొంది. ఫలితంగా సెప్టెంబర్ నెలలో ఉపఎన్నికలు జరగుతాయిని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన వరుసగా మూడోసారి అధికారం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, నందిగ్రామ్ నుంచి పోటీచేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం బీజేపీ అభ్యర్థి, ఒకప్పుడు మమతకు కుడిభుజంగా ఉన్న సువేందు అధికారి చేతిలో పరాజయం చవిచూశారు. టీఎంసీ విజయం సాధించడంతో మమతా బెనర్జీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే. రాజ్యాంగ నిబంధనల ప్రకారం సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల్లోపు తప్పనిసరిగా ఆమె చట్టసభకు ఎన్నిక కావాల్సి ఉంది.
ఒకవేళ నవంబరులోపు మమతా బెనర్జీ ఎన్నికకాకుంటే బెంగాల్‌లో రాజ్యాంగ సంక్షోభం వచ్చే అవకాశం ఉంది. ఈ క్రమంలో తప్పనిసరిగా ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీచేసి గెలవాలి. ఈసారి తన సొంత నియోజకవర్గం భవానిపుర్ నుంచి మమతా బెనర్జీ పోటీచేయనున్నారు. మరోవైపు, మండలి ఏర్పాటుకు కూడా బెంగాల్ సీఎం అసెంబ్లీలో తీర్మానం చేసి.. కేంద్రానికి పంపారు. మండలి ఏర్పాటయితే ఎమ్మెల్సీగా ఎన్నికైనా సీఎంగా కొనసాగడానికి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తమకున్న అన్ని అవకాశాలను ఉపయోగించుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నాలు చేస్తున్నారు.
పశ్చిమబెంగాల్ ఎన్నిలు ఉత్కంఠగా సాగిన విషయం తెలిసిందే. మమతా బెనర్జీ గత విజయాల్లో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి సహా పలువురు టీఎంసీ నేతలు బీజేపీలో చేరి పోటీ చేయడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. అయితే, తుది ఫలితాలు మాత్రం టీఎంసీకే పట్టం కట్టాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని అధికార టీఎంసీ కూటమి మొత్తం 213 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించగా.. బీజేపీ కూటిమి 77 స్థానాల్లో గెలుపొందింది. వామపక్షాలు ఒక స్థానంలో, ఇతరు మరో స్థానాన్ని దక్కించుకున్నాయి.
కాగా, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ టీఎంసీ గెలుపు కోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేసిన విషయం తెలిసిందే. టీఎంసీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే, పశ్చిమబెంగాల్‌లో టీఎంసీని గెలిపించిన అనంతరం ప్రశాంత్ కిషోర్ తాను రాజకీయ వ్యూహకర్తగా కొనసాగనని స్పష్టం చేశారు. అయితే, ఆయన టీఎం మాత్రం కార్యకలాపాలు కొనసాగిస్తోందని పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుకు వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసే పనిలో పడ్డారు. ఎన్సీపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీల నేతలతో ప్రశాంత్ కిషోర్ కలిసి కీలక చర్చలు కొనసాగించారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కలవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరతారా? అనే చర్చకు దారితీసింది. అయితే, దీనిపై ప్రశాంత్ కిషోర్ గానీ.. కాంగ్రెస్ గానీ స్పందించలేదు.












Click it and Unblock the Notifications