లోక్ సభ స్పీకర్ పోస్టు వదులుకునేందుకు బీజేపీ ససేమిరా ! పట్టువీడని టీడీపీ, జేడీయూ..!
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయంతో కేంద్రంలో అధికారం చేపట్టిన ఎన్డీయే సర్కార్ కు లోక్ సభ స్పీకర్ పదవి విషయంలో సంకటం తప్పట్లేదు. బీజేపీతో గతానుభవాల నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ పదవి తమకే ఇవ్వాలని కింగ్ మేకర్లుగా మారిన కీలక మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూ పట్టుబడుతున్నాయి. అయితే బీజేపీ మాత్రం స్పీకర్ పదవి వదులుకునేందుకు అస్సలు ఇష్టపడటం లేదు.
బీజేపీ నుంచి గతంలో సుమిత్రా మహాజన్, ఓం బిర్లా స్పీకర్లుగా పనిచేశారు. పూర్తిగా బీజేపీకి వీర విధేయులైన వీరిద్దరూ కేంద్రానికి సహకరిస్తూ విపక్షాలను అణిచివేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున ఎంపీలను సస్పెండ్ చేశారు. దీంతో స్పీకర్ పదవికి ఎక్కడ లేని డిమాండ్ ఏర్పడింది. కేంద్రంలో బొటాబొటీ మెజారిటీతో మూడోసారి అధికారం చేపట్టిన బీజేపీకి స్పీకర్ పదవి కీలకంగా మారింది. గతంలో మెజార్టీతో స్పీకర్లను నియమించుకున్న బీజేపీకి ఇప్పుడు మైనార్టీతో ఉండటంతో ఆ పదవి తప్పనిసరిగా మారింది.

అలాగే గతంలో స్పీకర్ల సాయంతో పార్టీలను చీల్చి తమవైపుకు ఎంపీలను తిప్పుకున్న బీజేపీకి ఈసారి కూడా ఆ పదవి తప్పనిసరైంది. దీంతో కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన మిత్రపక్షాలు టీడీపీ, జేడీయూకి రెండేసి మంత్రి పదవులు, అందులోనూ ఒక్కొక్క కేబినెట్ బెర్తు మాత్రమే ఇచ్చి మమా అనిపించేసింది. దీంతో ఇప్పుడు స్పీకర్ పోస్టు తమకు ఎలాగైనా ఇవ్వాల్సిందేనని ఆయా పార్టీలు పట్టుబడుతున్నాయి. కానీ బీజేపీ నో అంటోంది.
ఈ నేపథ్యంలోనే బీజేపీకి చెందిన ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు తెరపైకి వస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఉన్న పురందేశ్వరికి ఈసారి మోడీ కేబినెట్లో అవకాశం వచ్చినా పదవి దక్కలేదు. దీంతో ఆమెను స్పీకర్ గా నియమించి దక్షిణాదికి ప్రాధాన్యం ఇచ్చినట్లు చెప్పుకునేందుకు, తమకు అనుకూలంగా ఉండే ఎంపీకి ఆ పదవి కట్టబెట్టినట్లవుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారు.
రాజ్యాంగం ప్రకార కొత్త లోక్‌సభ మొదటిసారి సమావేశమయ్యే ముందు వెంటనే స్పీకర్ పదవి ఖాళీ అవుతుంది. సభలోని సీనియర్ సభ్యుల నుండి రాష్ట్రపతి నియమించిన ప్రొటెం స్పీకర్ కొత్త ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం సాధారణ మెజారిటీతో లోక్ సభ సభ్యుల నుండి స్పీకర్ ఎన్నుకోబడతారు. లోక్‌సభ స్పీకర్‌గా ఎన్నిక కావడానికి నిర్దిష్ట ప్రమాణాలు లేకపోయినా, రాజ్యాంగం మరియు పార్లమెంటరీ నిబంధనలపై అవగాహన కలిగి ఉండటం అవసరం.












Click it and Unblock the Notifications