రంగంలోకి రెడ్డి బ్రదర్స్: బీజేపీ కొత్త వ్యూహంతో కాంగ్రెస్, జేడీఎస్ చిత్తేనా?
బెంగళూరు: కర్ణాటక రాజకీయాలు గంట గంటకు మారుతూ తీవ్ర ఉత్కంఠకు గురిచేస్తున్నాయి. 104 స్థానాల్లో గెలుపొంది అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎలాగైనా అధికారం చేపట్టాలని నిర్ణయించుకుంది. అలాగే కాంగ్రెస్-జేడీఎస్ లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ముమ్మర కసరత్తులు చేస్తున్నాయి.

కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలపై..
ఈ నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్-జేడీఎస్ కలిసి తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని గవర్నర్‌ను కోరాయి. ఈ నేపథ్యంలో బీజేపీ.. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల ఎమ్మెల్యేలపై కన్నేసింది.

బీజేపీ వ్యూహం ఇలా
విశ్వాస తీర్మానం సమయంలో కొందరు కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడం లేదా వారిని దూరంగా ఉంచేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీంతో మ్యాజిక్ ఫిగర్ 112కి చేరకుండా చూడాలని ప్రయత్నిస్తోంది.

జేడీఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు..
కాంగ్రెస్ గెలిచిన 78 మంది ఎమ్మెల్యేల్లో 26మందిని తన వైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు జరుపుతోంది. అలాగే జేడీఎస్ పార్టీకి చెందిన 38మంది ఎమ్మెల్యేల్లో 13మంది ఎమ్మెల్యేలను తమ పార్టీకి మద్దతు తెలిపేలా బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ ప్రయత్నం కష్టంగా ఉంటే, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన 8-9మంది ఎమ్మెల్యేలను రాజీనామా చేయించేందుకు పావులు కదుపుతోంది.

గాలి సోదరులే కీలకంగా..
ఈ వ్యవహారమంతా రెడ్డి సోదరులు(గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు) చూసుకునేలా బీజేపీ నిర్ణయించింది. దీంతో వారు రంగంలోకి దిగి తమకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి మద్దతిచ్చేలా చూసుకుంటున్నారు. కాగా, రెడ్డి సోదరులకు డబ్బు, అధికార బలంలో సమతూకంగా నిలిచే కాంగ్రెస్ నేత డీకే శివకుమార్.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు రక్షణగా ఉండటం గమనార్హం. తమ ఎమ్మెల్యేలు బీజేపీ వైపు వెళ్లకుడా జేడీఎస్ కూడా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది.












Click it and Unblock the Notifications