నో ప్రాబ్లం: బీజేపీకో ప్రతివ్యూహం ఉంది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు వల్ల తమకు జరిగే నష్టమేమీ లేదని కమలనాథులు తలపోస్తున్నారు. ఆ పొత్తుపై చిరు నవ్వులు చిందిస్తున్నారు.
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ)తో కాంగ్రెస్ పార్టీ పొత్తు వల్ల తమకు జరిగే నష్టమేమీ లేదని కమలనాథులు తలపోస్తున్నారు. ఆ పొత్తుపై చిరు నవ్వులు చిందిస్తున్నారు. ముస్లిం ఓటర్లు బిఎస్పీ అధినేత మాయావతి సారథ్యంలోని దళిత్ - ముస్లిం కాంబినేషన్ వైపు ముగ్గుతారని వారి అంచనా. ఒకవేళ బిజెపిని ఓడించేందుకు ముస్లింలు కూటమి బాట పడితే తమకు హిందువుల ఓట్లు పొందేందుకు ప్రతివ్యూహం రచించామని కమలనాథులు చెప్తున్నారు.
గత ఏడాది నుంచి ఎస్పీ, యూపీ ప్రభుత్వంపై బిజెపి నేతలు తమ ప్రచారంలో విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. బిఎస్పీ కంటే ఎస్పీని ప్రధాన ప్రత్యర్థిగా కమలనాథులు భావించడమే దానికి కారణంగా తెలుస్తున్నది. ముస్లింల ఓట్లు గుండుగుత్తగా ఎస్పీకి పడతాయన్నది తద్వారా ఆ పార్టీ మరింత బలోపేతం అవుతుందన్నది బిజెపి అంచనా. కానీ గత నాలుగు నెలలుగా ఎస్పీలో కొనసాగుతున్న అంతర్యుద్దం కారణంగా ముస్లింలంతా మాయావతి సారథ్యంలోని బిఎస్పీ వైపు దూకుడుగా మొగ్గుతున్నారని భావిస్తున్నారు.
జాతవేతర దళితులపై బిజెపి నజర్
'ఎస్పీలో అంతర్గత విభేదాలు సద్దుమణగక ముందు ముస్లింలను తన వైపు తిప్పుకునేందుకు మాయావతి తన వంతు ప్రయత్నాలు చేశారు. అందువల్లే దళిత్ - ముస్లిం కాంబినేషన్ పట్ల బిజెపి యూపీ నేతలు నిద్రలేని రాత్రిళ్లు గడిపారు. హిందువులను తమవైపుకు తిప్పుకునేందుకు ఎస్పీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు బీజేపీకి సానుకూల అంశమే' అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎస్పీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరినా ముస్లింలంతా కూటమికే ఓటేసే అవకాశాల్లేవు. ముస్లింలంతా ఇప్పటికే బిఎస్పీ వైపు మొగ్గారని బీజేపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. అలాగే దళిత ఓట్లన్నీ బీఎస్పీకి మేలు చేయకపోవచ్చునని అంటున్నారు. దళితుల్లో జాతవేతర దళితులను ఆకర్షించేందుకు కమలనాథులు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
పట్టణాల్లో అగ్ర కులాల ఓట్లపై కమలనాథుల ఆశలు
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలు జట్టుగా పోటీ చేస్తే పట్టణ ప్రాంతాల్లో తమకు అనుకూలమైన గాలి వీస్తుందని కమలనాథుల అంచనా. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లోని అగ్రకులాల వారంతా తమకే ఓటేస్తారని బిజెపి నేతలు భావిస్తున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే జరిగిందని వారు గుర్తుచేస్తున్నారు.
గాంధీ కోటలపై ఎస్పీ గురి
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదిరినా నెహ్రూ - గాంధీ కుటుంబం కంచుకోటలపై ద్రుష్టి సారించింది. సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాయబరేలి, రాహుల్ గాంధీ సారథ్యంలోని అమేథి లోక్ సభా నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి ఎస్పీ సిద్ధమవుతున్నది. రెండు నియోజకవర్గాల పరిధిలో ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీకి సిద్ధమైంది. రాయబరేలిలో మూడు, అమేథిలో రెండు స్థానాలకు ఎస్పీ అభ్యర్థులను ప్రకటించింది. మిగతా స్థానాలను కాంగ్రెస్ పార్టీకి వదిలేసింది.
2012లో ఏడు స్థానాల్లో ఎస్పీ గెలుపు
2012 అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్ వాదీ పార్టీ పది అసెంబ్లీ స్థానాల్లో ఏడింటిలో విజయం సాధించింది. కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలకే పరిమితమైంది. ఈ దఫా ఐదు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నది. ఎస్పీ ఒకటి, రెండు స్థానాల్లో పోటీ చేయనున్నది. రెండు పార్టీల మధ్య పొత్తు ఖరారు కాకపోవడంతో ఎస్పీ తన అభ్యర్థుల పేర్లు ప్రకటించింది.
కానీ అమేథి, రాయబరేలీ స్థానాల పరిధిలో ఇటువంటి పరిస్థితి తలెత్తదని సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత గులాం నబీ ఆజాద్ పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో తమ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా వ్యవహరించబోదన్నారు. ప్రస్తుతం తాము సగం స్థానాల్లో పోటీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్, ఎస్పీల మధ్య పొత్తు క్రెడిట్ అంతా ప్రియాంకగాంధీకే చెందుతుందన్నారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తు కోసం విజయం సాధించినందుకు ఆమెను అభినందించారు.












Click it and Unblock the Notifications