పార్లమెంట్‌లోనే బిజెపి వైఖరి వెల్లడి: టీపై దిగ్విజయ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లుపై (తెలంగాణ బిల్లుపై) బిజెపి వైఖరి పార్లమెంటులో బిల్లు పెడితే తేలిపోతుందని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ అన్నారు. తెలంగాణకు అనుకూలమని గతంలో బిజెపి చెప్పిందని ఆయన శనివారంనాడు అన్నారు. విభజనపై అబిప్రాయాలు చెప్పేందుకు అందరికీ స్వేచ్ఛ ఇచ్చామని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాది అని, అందుకే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విభజనను వ్యతిరేకిస్తూ దీక్ష చేశారని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెసు పార్టీని గానీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని గానీ ఒక్క మాట కూడా అనలేదని ఆయన సమర్థించారు.

కాగా, పార్లమెంటులో బిల్లు పెట్టిన తర్వాత తమ వైఖరిని చెబుతామని బిజెపి నేత నిర్మలా సీతారామన్ అన్నారు. బిల్లులో ఏముందో తమకు తెలియదని ఆమె అన్నారు. కాంగ్రెసు నాయకులు తమతో చర్చించి లాభం లేదని, ముందు వాళ్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఒప్పించాలని ఆమె అన్నారు. తాము రాష్ట్ర విభజనకు అనుకూలమని ఆమె అన్నారు. తాము 1997 నుంచి విభజనకు అనుకూలంగానే ఉన్నామని చెప్పారు.
కిరణ్ రెడ్డిపై చర్యలు: విహెచ్
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో ఆ విషయం చెప్పారు. సరైన సమయంలో ముఖ్యమంత్రిపై చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం కిరణ్ సీమాంధ్రలో హీరో కావాలన్న ఉదేద్దశంతో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదానికి అన్ని పార్టీలు సహకరిస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసుందామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications