2 శాతం తేడాతో రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ బీజేపీకి-8 శాతం తేడాతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఓటమి..
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల ఫలితాలు తేలిపోయాయి. ఇందులో మూడు రాష్ట్రాల్ని బీజేపీ కైవసం చేసుకుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ సాధించిన విజయాలు ఓ ఎత్తయితే కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల్ని కోల్పోయిన తీరు మరింత ఆశ్చర్యంగా మారింది. ఎన్నికల సమయంలో కానీ, పోలింగ్ తర్వాత కానీ రాజకీయ పార్టీలు ఏమాత్రం ఊహించని రీతిలో ఈ ఫలితాలు ఉన్నాయి.
రాజస్తాన్, ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ పార్టీ పరాజయాల్ని ఓసారి గమనిస్తే కేవలం రెండు శాతం ఓట్ల తేడాతోనే వీటిని కోల్పోయిందని అర్దమవుతోంది. కానీ మధ్యప్రదేశ్ లో మాత్రం బీజేపీ అనూహ్యంగా 8 శాతం ఓట్ల తేడాతో కాంగ్రెస్ ను వెనక్కి నెట్టి విజయం సాధించింది. దీంతో ఈ మూడు హిందీ రాష్ట్రాల్లో ఎన్నికల ఓట్ల తేడాపై ఇప్పుడు రాజకీయ పార్టీల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటములు చర్చనీయాంశమవుతున్నాయి.

మధ్యప్రదేశ్ లో ఈసారి భారీ సీట్ల తేడాతో గెలిచిన బీజేపీ 48.74 శాతం ఓట్లు సాధించింది. రెండో స్ధానంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 40.42 శాతం ఓట్లు సాధించి ఓటమి పాలైంది. ఈ రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 8.3 కావడం విశేషం. మధ్యప్రదేశ్ లో గెలుపుపై కాంగ్రెస్ భారీ ఆశలు పెట్టుకున్నా ఘోర పరాజయం పాలవ్వడం అధిష్టానానికి సైతం షాక్ ఇచ్చింది. అలాగే రాజస్తాన్ లోనూ అధికారం నిలబెట్టుకుంటామని ఆశించిన కాంగ్రెస్ కు నిరాశ తప్పలేదు.
రాజస్తాన్ లో ఈసారి అధికారం అందుకున్న బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 41.79 కాగా.. ఓటమి పాలైన కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల శాతం 39.5. అంటే కేవలం 2.29 శాతం ఓట్ల తేడాతో రాజస్తాన్ ను కాంగ్రెస్ కోల్పోయిందన్న మాట. మరోవైపు ఛత్తీస్ ఘడ్ లో బీజేపీ 46.30 శాతం ఓట్లు సాధించి అధికారం అందుకుంటుండగా... కాంగ్రెస్ పార్టీకి 42.12 శాతం ఓట్లు లభించాయి. ఇక్కడా ఈ రెండు పార్టీలు సాధించిన ఓట్ల శాతాల్లో తేడా కేవలం 2.29 మాత్రమే.












Click it and Unblock the Notifications