వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బ్లాక్ ఫంగస్: భారత్‌లో అధిక సంఖ్యలో బ్లాక్ ఫంగస్ కేసులకు డయాబెటిస్ కారణమా?

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
భారతదేశంలో సుమారు 12,000 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి

భారత్‌లో సుమారు 12 వేల బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు ముఖ్యంగా కోవిడ్ వచ్చి కోలుకున్నవారిలో ఎక్కువగా కనిపించాయి.

ఇది అరుదుగా కనిపించే ఇన్ఫెక్షన్. దీని బారిన పడిన వారిలో 50 శాతం మంది చనిపోతున్నారు.

భారత్‌లో మధుమేహం ఎక్కువగా ఉండడం వల్లే, ఈ కేసులు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

కానీ, ఇతర దేశాల్లో ఏం జరుగుతోంది? ఈ ఇన్ఫెక్షన్ రావడం వెనుక ఉన్న ఇతర కారణాలేంటి?

ఏయే దేశాల్లో బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి?

కోవిడ్ మహమ్మారికి ముందు కనీసం 38 దేశాల్లో మ్యూకోర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) కేసులు నమోదయ్యాయి.

భారత్, పాకిస్తాన్‌లో అత్యధిక స్థాయిలో ప్రతీ 10 లక్షల జనాభాలో సంవత్సరానికి 140 కేసులు నమోదవుతున్నట్లు ఇంటర్నేషనల్ ఫంగల్ ఎడ్యుకేషన్ తెలిపింది.

గుజరాత్‌లోని ఒక ఆసుపత్రిలో మ్యూకోర్‌మైకోసిస్ వార్డు

"భారతదేశంలో మహమ్మారికి ముందు కూడా ప్రపంచంలో ఎక్కడా లేనన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్‌ కేసులు నమోదయ్యాయి" అని మాంచెస్టర్ యూనివర్సిటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నిపుణుడు డాక్టర్ డేవిడ్ డెన్నింగ్ చెప్పారు.

మ్యూకోర్‌మైకోసిస్ రావడానికి, నియంత్రణ లేని మధుమేహానికి బలమైన సంబంధం ఉందని, దేశంలో మధుమేహ రోగులు ఎక్కువగా ఉన్నారని అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఈ ఇన్ఫెక్షన్ సోకినవారిలో 94 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు ఇటీవల ప్రచురితమైన ఒక అధ్యయనం పేర్కొంది.

వీటిలో 71 శాతం కేసులు భారతదేశం నుంచే ఉన్నాయి.

ఇతర దేశాల్లో కూడా మధుమేహం వల్లే ఇన్ఫెక్షన్ సోకుతోందా?

మధుమేహం ప్రాబల్యం ఎక్కువగా ఉన్న అగ్ర దేశాల్లో, ఇతర దేశాల్లో కూడా మ్యూకోర్‌మైకోసిస్ కేసులు నమోదయ్యాయి.

తలసరికి మధుమేహం ఎక్కువగా ఉన్న దేశాల్లో కూడా మ్యూకోర్‌మైకోసిస్ కేసులు నమోదయ్యాయి.

పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లో కూడా మధుమేహం ఉన్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అక్కడ కూడా మ్యూకోర్‌మైకోసిస్ కేసులు నమోదయ్యాయి. కానీ, అక్కడ ఇవి పెద్ద సంఖ్యలో నమోదు కాలేదు.

బంగ్లాదేశ్‌లో కూడా డాక్టర్లు ఒక మ్యూకోర్‌మైకోసిస్ కేసుకు చికిత్స చేస్తున్నారు. మరొక కేసు ఫలితాల గురించి ఎదురుచూస్తున్నారు. ఈ ఇద్దరు రోగులకు మధుమేహం ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.

పాకిస్తాన్‌లో కూడా ఇటీవల 5 మ్యూకోర్‌మైకోసిస్ కేసులు నమోదయ్యాయి. మే 12న ఈ ఇన్ఫెక్షన్ సోకిన నలుగురు చనిపోయినట్లు పాకిస్తాన్ మీడియా రిపోర్టులు చెబుతున్నాయి.

బ్రెజిల్‌లో ఇప్పటి వరకు 29 కేసులు నమోదయ్యాయి. కానీ, వీరిలో ఎంత మందికి మధుమేహం ఉందనేది తెలియదు.

రష్యాలో కూడా కోవిడ్ రోగుల్లో కొన్ని బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. అయితే, వీటిలో ఎన్నింటిని గుర్తించారు అనే విషయంలో స్పష్టత లేదు.

అమెరికా జనాభాలో 9.3 శాతం మందికి మధుమేహం ఉన్నట్లు అంచనా. ఇక్కడ ప్రపంచంలోనే అత్యధిక కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

కానీ, మ్యూకోర్‌మైకోసిస్ రావడం మాత్రం అరుదు. అక్కడ కేవలం 3 శాతం మాత్రమే గుర్తించని మధుమేహం కేసులు ఉంటాయి" అని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ తెలిపింది.

డయాబెటిస్ ఎందుకు ముప్పుగా ఉంది?

మధుమేహం ఎక్కువగా ఉండటం కంటే, మధుమేహం గుర్తించకుండా ఉండటమే సమస్య అని నిపుణులు చెబుతున్నారు.

"భారతదేశం, నేపాల్, బంగ్లాదేశ్, శ్రీ లంకలో 57 శాతం మంది మధుమేహానికి చికిత్స తీసుకోరు" అని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ చెబుతోంది. ముఖ్యంగా ఇలాంటి కేసులు భారతదేశంలో ఎక్కువని చెబుతున్నారు.

పాకిస్తాన్‌లో కూడా గుర్తించని మధుమేహం కేసులు ఎక్కువ.

"భారతదేశంలో ప్రజలు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోకపోవడం వల్లే నియంత్రణలో లేని మధుమేహం కేసులు ఎక్కువగా ఉంటాయి" అని కిర్గిస్తాన్‌లో ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌ డాక్టర్ హరి ప్రశాంత్‌ప్రకాష్ చెప్పారు.

"చాలా మధుమేహం కేసులు, సాధారణంగా ఇతర ఆరోగ్య సమస్యలకు చికిత్స చేస్తున్నప్పుడు బయటపడతాయి" అన్నారు.

మధుమేహం నియంత్రణలో లేనప్పుడు ఈ ఇన్ఫెక్షన్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుంది.

ఆఫ్రికాలో కూడా గుర్తించని మధుమేహ రోగులు సుమారు 60 శాతం మంది ఉన్నారు. కానీ, అక్కడ మ్యూకోర్‌మైకోసిస్ కేసులు 3 శాతం కంటే తక్కువగా ఉన్నాయి.

"మ్యూకోర్‌మైకోసిస్‌ను గుర్తించలేకపోవడం కూడా కేసులు తక్కువగా ఉండటానికి కారణం కావచ్చు. దాన్ని గుర్తించడం అంత సులభం కాదు" అని డాక్టర్ డెన్నింగ్ అన్నారు.

టిష్యూ శాంపిల్ సేకరణ కష్టం కావడంతో ఈ కేసుల్లో చాలావరకూ బయటపడవని అధ్యయనాలు చెబుతున్నాయి.

బ్లాక్ ఫంగస్ రావడానికి ఇతర కారణాలేంటి?

కోవిడ్ చికిత్సలో భాగంగా విపరీతంగా వాడే స్టెరాయిడ్ల వల్ల కూడా మ్యూకోర్‌మైకోసిస్ లేదా ఇతర ఇన్ఫెక్షన్‌లు రావచ్చని నిపుణులు చెబుతున్నారు. కోవిడ్ చికిత్సలో డెక్సామెథాసోన్ , మిథైల్‌ప్రెడ్నిసోలోన్ స్టెరాయిడ్లను వాడుతున్నారు.

బ్లాక్ ఫంగస్

కానీ, పెరిగిన కోవిడ్ కేసులతో ఆసుపత్రులు, వైద్య సిబ్బంది సతమతం అవుతుండటంతో, చాలా మంది రోగులు ఈ మందులను వైద్యుల పర్యవేక్షణ లేకుండానే తీసుకుంటున్నారు.

"సొంతంగా మందులు తీసుకోవడం వల్ల చాలా తీవ్రమైన, ప్రమాదకరమైన పరిణామాలు ఉంటాయని భారత అధికారులు హెచ్చరించారు. అలా చేయడం వల్ల మ్యూకోర్‌మైకోసిస్ లాంటి ఇన్ఫెక్షన్లు కూడా రావచ్చన్నారు" అని డాక్టర్ డెన్నింగ్ తెలిపారు.

ఇన్ఫెక్షన్ తీవ్ర స్థాయిలో, ఒక మోస్తరు స్థాయిలో ఉన్నవారికి డెక్సామెథాసోన్ వాడటం వల్ల మరణాలు తగ్గుతున్నాయని యూకేలో నిర్వహించిన అధ్యయనాలు తెలియచేశాయి.

కానీ, ఇదే మందును తేలికపాటి ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో వాడితే, అది తీవ్ర పరిణామాలకు దారి తీయవచ్చు.

ఆసుపత్రిలో చేరినవారిలో డెక్సామెథాసోన్ వాడటం వల్ల ఫలితాలు ఉన్నట్లు అధ్యయనం తెలిపింది. కానీ, కొన్ని రాష్ట్రాల్లో హోమ్ ఐసోలేషన్ కిట్‌లో కూడా ఈ మందును పంపిణీ చేసినట్లు తెలిసింది.

"స్టెరాయిడ్‌లు ఎక్కువగా తీసుకోవడం మంచిది కాదని అధ్యయనాలు స్పష్టంగా చెబుతున్నాయి" అని డాక్టర్ డెన్నింగ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Black fungus: Is diabetes the cause of the high number of black fungus cases in India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X