వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శివసేన ఫైర్: ముఫ్తీతో చెట్టపట్టాలేల?, ఈనాటి బంధమేనాటిదో..

బ్రుహన్ ముంబై మహానగర పాలిక పగ్గాలు చేపట్టేదెవరన్నఅంశంపై బీజేపీ, శివసేన మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కమలనాథులను కట్టడి చేసేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: బ్రుహన్ ముంబై మహానగర పాలిక పగ్గాలు చేపట్టేదెవరన్నఅంశంపై బీజేపీ, శివసేన మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కమలనాథులను కట్టడి చేసేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో జత కట్టేందుకు సిద్ధమని ప్రకటిస్తున్నశివసేన నాయకత్వం దూకుడు పెంచింది.

అధికారం కోసం కాంగ్రెస్ పార్టీతో జత కట్టే ప్రసక్తే లేదన్నమహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌పై శివసేన నిప్పులు చెరిగింది. ఆ పార్టీ అధికార దిన పత్రిక 'సామ్నా' సంపాదకీయంలో 'కాంగ్రెస్ మద్దతు తీసుకోబోమన్న సీఎం ఫడ్నవీస్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. కానీ చిన్న మార్పుతోపాటు సూచన చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో కలవబోమని ప్రకటించిన ఫడ్నవీస్.. అధికారం కోసం పాకిస్థాన్ మద్దతు దారు మెహబూబా ముఫ్తీతో మాత్రం చేతులు కలుపుతారు' అని ఎద్దేవా చేసింది.

పార్లమెంట్‌పై దాడి ఘటనలో ప్రధాన దోషి అఫ్జల్ గురుకు ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీ బహిరంగంగా మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2015లో జరిగిన జమ్ముకాశ్మీర్ ఎన్నికల్లో త్రిశంకు సభ ఏర్పడంతో తొలుత ముఫ్తీ మహ్మద్ సయీద్, తర్వాత మెహబూబా ముఫ్తీ ప్రభుత్వంలో బీజేపీ మిత్ర పక్షంగా ఉన్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)ల నుంచి నాయకులను దిగుమతి చేసుకున్న బీజేపీ పరిస్థితి అద్వాన్నంగా మారిందని కూడా సామ్నా వ్యాఖ్యానించింది.

మెజారిటీపై శివసేన ఇలా..

మెజారిటీపై శివసేన ఇలా..

227 మంది కార్పొరేటర్లు గల బీఎంసీలో మరింత మద్దతు కూడగట్టడంతోపాటు బీజేపీకి అడ్డుకట్ట వేయడానికి శివసేన కఠిన వైఖరి ప్రదర్శిస్తున్నదని సమాచారం. మేయర్ పదవిని దక్కించుకోవడంపైనే ద్రుష్టిని కేంద్రీకరించిన శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే.. తన బంధువు రాజ్ థాకరే సారథ్యంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) వైపు చూస్తున్నారు. మరాఠా ఆధిపత్య రాజకీయాల కోసం ఎమ్మెన్నెస్ తమకు వ్యతిరేక నిర్ణయం తీసుకోదని ఉద్ధవ్ థాకరే భావిస్తున్నారు. ఇప్పటికే మేయర్ ఎన్నిక విషయమై శివసేనకు బాసటగా నిలిచేందుకు శరద్ పవార్ ఆధ్వర్యంలోని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సంకేతాలు ఇవ్వడంతో ఎమ్మెన్నెస్ వైఖరి తేలితే స్పష్టత వస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో మరాఠీలు శివసేన పక్షాన నిలిస్తే.. ఇతరులు బీజేపీకి ఓటేశారు.

స్థానిక రాజకీయాల్లో పొత్తులు ఇలా..

స్థానిక రాజకీయాల్లో పొత్తులు ఇలా..

ఇటీవల ముగిసిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్సీపీని అడ్డుకునేందుకు స్థానికంగా కాంగ్రెస్, శివసేన అక్కడక్కడ కలిసి పోటీ చేశాయి. రాయిగడ్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ శివసేనతో జట్టు కట్టింది. ఉస్మానాబాద్ జిల్లాలో బీజేపీతో చేతులు కలిపింది. మూడేళ్ల క్రితం గూండియా జెడ్పీ ఎన్నికల్లో కాంగ్రెస్ - బీజేపీ కూటమి కట్టాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వైరి పక్షాలైనా.. స్థానిక కారణాలు, సమీకరణాల వల్ల మూడు పార్టీలు పరస్పరం చేతులు కలుపుతునే ఉన్నాయి.

గతంలో మద్దతు ఇచ్చిపుచ్చుకున్నామన్న శివసేన

గతంలో మద్దతు ఇచ్చిపుచ్చుకున్నామన్న శివసేన

అయితే ప్రస్తుతం బీఎంసీలో పాలక మండలి ఏర్పాటుకు ఎవరికీ పూర్తి మెజారిటీ రాకపోయినా అతిపెద్ద పార్టీగా అవతరించిన శివసేన గతంలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న వైనాన్ని గుర్తుచేస్తోంది. ప్రత్యేకించి 2007, 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన సంగతి ప్రస్తావిస్తోంది. సిద్ధాంత విభేదాల కారణంగానే శివసేనకు వచ్చేనెల తొమ్మిదో తేదీన జరిగే మేయర్ ఎన్నికల్లో మద్దతునివ్వలేమని కాంగ్రెస్ పార్టీ నేతలు సంజయ్ నిరుపమ్, గురుదాస్ కామత్ తదితరులు ప్రకటించిన సంగతి తెలిసిందే.

కమ్యూనిస్టులను అడ్డుకునేందుకు శివసేనకు సాయం

కమ్యూనిస్టులను అడ్డుకునేందుకు శివసేనకు సాయం

1970వ దశకంలో శివసేన, కాంగ్రెస్ పార్టీ కలిసి ముందుకు సాగిన సంగతిని పలువురు రాజకీయ విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. శివసేన ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ అనుసరించిన విధానాలే కారణమని పలువురు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నతేలు గుర్తుచేస్తున్నారు. నాడు ముంబైలోని టెక్స్‌టైల్స్ మిల్లుల్లో శక్తిమంతులుగా ఉన్న కమ్యూనిస్టులను దెబ్బ తీసేందుకు శివసేనకు కాంగ్రెస్ పార్టీ ఇతోధిక సహకారం అందించిన సంగతి గుర్తుచేస్తున్నారు. అప్పట్లో సీఎంగా ఉన్న వసంత్ రావ్ నాయక్ నేత్రుత్వంలోని కాంగ్రెస్ పార్టీ నుంచి శివసేనకు పూర్తి సహాయ సహకారాలు అందాయి. అందువల్లే నాడు కమ్యూనిస్టులు శివసేనను ‘వసంత్ సేన' అని అభివర్ణించారని ఒక సీనియర్ కాంగ్రెస్ పార్టీ నేత చెప్పారు.

ఆర్ఎస్ఎస్ రాజీ ఫార్ములా కొట్టేసిన శివసేన..

ఆర్ఎస్ఎస్ రాజీ ఫార్ములా కొట్టేసిన శివసేన..

బీఎంసీ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుకనుగుణంగా ఇరు పార్టీల నేతలు సంప్రదిస్తున్నట్లు తెలుస్తున్నది. అయితే వచ్చేనెల 8వ తేదీ లోపు పరిస్థితుల్లో స్పష్టత వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. శివసేన, బీజేపీ మధ్య రాజీకి మేయర్ పదవిని చెరో రెండున్నరేళ్లు పంచుకోవాలని ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎంజీ వైద్య ప్రతిపాదించారు. కానీ శివసేన దీన్ని కొట్టి పారేసింది. తమకు ఆయన సలహాలు అవసరం లేదని, అవసరమైనప్పుడు తీసుకుంటామని, ఆయన సలహాలు అవసరమైన వారికి ఇవ్వాలని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు.

శివసేన మద్దతుతో అంతూలే సర్కార్..

శివసేన మద్దతుతో అంతూలే సర్కార్..

1976లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో మనోహర్ జోషి ముంబై మేయర్ గా ఎన్నికయ్యారు. తర్వాత ఏడాది కాంగ్రెస్ నేత మరళీ దేవ్ రా మేయర్ గా ఎన్నివ్వడానికి శివసేన మద్దతునిచ్చిన సంగతిని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో మద్దతు పొందినందుకు ప్రతిగా 1980లో శివసేన.. కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికింది. తర్వాత ఎఆర్ అంతూలే ప్రభుత్వానికి శివసేన మద్దతునిచ్చిందని, దానికి ప్రతిఫలంగా నలుగురు ఎమ్మెల్సీలు, ఎంహెచ్ఎడిఎ చైర్మన్ పదవిని పొందిందని బీజేపీ సీనియర్ నేత ఒకరు గుర్తు చేశారు.

1984లో తొలిసారి బీజేపీతో శివసేన జట్టు

1984లో తొలిసారి బీజేపీతో శివసేన జట్టు

మరాఠీల హక్కుల కోసం పోరాడుతున్న శివసేన 1983 తర్వాత హిందుత్వ సిద్ధాంతం వైపు మొగ్గింది. ఆ మరుసటి ఏడాది 1984లో బీజేపీతో కలిసి లోక్ సభ ఎన్నికలలో పోరాడింది. దశాబ్ద కాలానికి రెండు పార్టీలు కలిసి 1995లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాటి నుంచి 2005 వరకు వారి అధికారం కొనసాగింది. 2014లో జరిగిన ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ ఎక్కువ సీట్లు పొందినా మెజారిటీ సరిపోక పోవడంతో శివసేన మద్దతుతో ఫడ్నవీస్ సర్కార్ మనుగడ సాగుతున్నది.

హై కమాండ్‌దే తుది నిర్ణయమన్న మాజీ సీఎం

హై కమాండ్‌దే తుది నిర్ణయమన్న మాజీ సీఎం

బీఎంసీ మేయర్ ఎన్నిక విషయమై శివసేనకు మద్దతు ఇవ్వడం చాలా తీవ్రమైన అంశమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రుథ్వీరాజ్ చవాన్ స్పష్టం చేశారు. ఆ పార్టీతో పొత్తుకు చాలా అంశాలు పరిశీలించాల్సిన అవసరం ఉన్నదన్నారు. దీనిపై తుది నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వానిదేనని స్పష్టం చేశారు. వచ్చేనెల 11న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాతే బీఎంసీ పీఠం ఎవరిదన్న స్పష్టత వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

English summary
A compromise between the saffron allies for control over the BMC on Monday seemed elusive with an aggressive Shiv Sena taunting its ally by sayinh in today’s situation it would be better to side with the Congress than the BJP in its current avatar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X