రైతులు నక్సలైట్లుగా మారతారు: నానా పటేకర్
లాతూరు: ప్రస్తుత వ్యవసాయ సంక్షోభంతో ప్రమాదకర పర్యవసానాలు ఎదురుకావచ్చని ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ హెచ్చరించారు. రైతుల ఆత్మహత్యలకు పరిష్కారం చూపకపోతే రైతు విప్లవం రావచ్చని ఆయన హెచ్చరించారు.
‘రైతులు తమ ప్రాణాలు తామే తీసుకోగల్గినప్పుడు ఇతరుల ప్రాణాలూ తీయగలరు. విప్లవ ఆలోచన సాగితే రైతులు నక్సలైట్లు కాగలరు' అని నానా పటేకర్ వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలోని లాతూరు, ఉస్మానాబాద్ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన రూ. 15వేల చొప్పున ఆర్థిక సాయం చేశారు.
అంతేగాక, వారంతాల్లో పర్యటించి మరఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పాలని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రైతులకు అండగా నిలబడాల్సిందిగా మరాఠీ నటుడు మకరంద్ అనాస్‌పురె తనను కోరారన్నారు. తామిద్దరం ఈ కార్యక్రమం ప్రారంభించామన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతులు మరణిస్తుంటే చూస్తూ ఇంట్లో కూర్చోలేను. మరణించిన రైతుల భార్యలు వందమంది ఇలా చెక్కుల కోసం ఎదురుచూడటం ఎంత బాధాకరమో ఆలోచించండి. నాకు కష్టమనిపించింది. ఇంత కంటే అవమానకరం మరేదీ ఉండదు' అని అన్నారు.
తొలుత సొంత ఆదాయం నుంచి ఖర్చు చేసిన పాటేకర్.. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు, స్నేహితుల మద్దతుతో ముందుకెళ్తున్నారు. ఇప్పటివరకు 113 మంది వితంతువులకు ఆర్థిక సాయం అందజేసిన ఈ బాలీవుడ్ నటుడు.. తన లైఫ్ మిషన్ ఇదేనన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర నేతలంతా కలిసి రావాలని నానా పాటేకర్ ఈ సందర్భంగా కోరారు. ఈ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్, కాంగ్రెస్ నేత నారాయణ్ రాణె కలిసి పనిచేయాలన్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!