వారణాసి-ముంబై ఎక్స్ ప్రెస్ రైలులో బాంబు
మాణిక్ పూర్: మహానగరి ఎక్స్ ప్రెస్ రైలులో నాటు బాంబు అమర్చడంతో ప్రయాణికులు, రైల్వే అధికారులు హడలిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి బాంబును నిర్వీర్యం చేశారు.
గురువారం వారణాసి-ముంబై మహానగరి ఎక్స్ ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్ లోని మాణిక్ పూర్ చేరుకుంది. ఎస్ 3 కోచ్ లోని మరుగుదొడ్డి బయట పేలుడు పదార్థం ఉన్న విషయం గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

బాంబు నిర్వీర్యదళం బృందాలు, రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే ప్రయాణికులు భయంతో పరుగు తీశారు. ఎస్ 3 కోచ్ లో అమర్చింది నాటు బాంబు అని అధికారులు గుర్తించారు.
వెంటనే బాంబును బయటకు తీసి దానిని నిర్వీర్యం చేశారు. ఉగ్రవాదులు ఎవరైనా ఈ బాంబును అమర్చారా, లేదా ఆందోళనలు సృష్టించడానికి ఎస్ 3 కోచ్ లో నాటు బాంబు అమర్చారా అని అధికారులు ఆరా తీస్తున్నారు. మాణిక్ పూర్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!