అమ్మ కొడుతోంది సార్ .. కేసు పెట్టండి: పోలీస్ స్టేషన్లో బుడతడి కంప్లైంట్; వీడియో వైరల్!!
ఇటీవల కాలంలో చిన్నారులు పోలీస్ స్టేషన్ల బాట పట్టడం ఎక్కువైపోయింది. పోలీసులంటే, పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చెయ్యటం అంటే పెద్దలే భయపడుతున్న తరుణంలో ఎలాంటి భయం లేకుండా పోలీస్ స్టేషన్లకు వెళ్లి చిన్నారులు ఫిర్యాదులు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విధంగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి చిన్న చిన్న కారణాలకు ఫిర్యాదులు చేసిన పిల్లల వీడియోలు వైరల్ అయ్యాయి. ఇక తాజాగా బీహార్ కు చెందిన ఓ బుడతడి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

అమ్మ కొడుతుందని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బుడతడు
ఇంతకీ ఆ బుడతడు ఏం చేశాడంటే అమ్మ తనను కొడుతోందని బీహార్ రాష్ట్రానికి చెందిన ఎనిమిదేళ్ల బుడతడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శివమ్ కుమార్ అనే బాలుడు తన తల్లిదండ్రులతో సీతామర్హి జిల్లా చంద్రికా మార్కెట్ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్నాడు. తన తల్లి తనకు సమయానికి తిండి పెట్టడం లేదని ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు. తనను కొడుతుంది కూడా అంటూ ఫిర్యాదు చేశాడు. ఇక ఈ ఘటన బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటుచేసుకుంది.

అన్నం పెట్టటం లేదని ఫిర్యాదు చేసిన బాలుడికి అన్నం పెట్టిన పోలీసులు
ఆ బాలుడు తన తల్లిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆకలవుతున్నా అన్నం పెట్టడం లేదని 8సంవత్సరాల శివమ్ కుమార్ తల్లి పైన ఫిర్యాదు చేశాడు. ఒకసారి అన్నం తింటుంటే ప్లేటు లాక్కుని కొడుతుందని కూడా ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీస్ స్టేషన్ అధికారి రాకేష్‌కుమార్ చిన్నారి చెప్పిన విషయాలను విని కొద్దిసేపు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టారు. బాలుడికి భోజనం ఏర్పాటు చేశాడు. బాలుడు భోజనం చేసిన తర్వాత ఆ తర్వాత ఎస్‌హెచ్‌ఓ చిన్నారి కుటుంబ సభ్యులను పిలిపించి చిన్నారిని కొట్టవద్దని సూచించి కుటుంబ సభ్యులతో ఇంటికి పంపించారు.

తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ .. బుడతడి వీడియో నెట్టింట వైరల్
ప్రతిరోజు సకాలంలో బిడ్డకు ఆహారం అందించాలని కుటుంబ సభ్యులకు ఎస్‌హెచ్‌ఓ సూచించారు. అయితే తల్లి ఎపుడైనా అల్లరి చేస్తే కొడతానని, భోజనం పెట్టకుండా ఎప్పుడు కొట్టలేదని పోలీసులకు చెప్పారు. కానీ బాలుడు మాత్రం సమయానికి భోజనం పెట్టకుండా అమ్మ కొడుతుందని మాత్రమే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కేసు పెట్టమన్నాడు .ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
గతంలోనూ పోలీస్ స్టేషన్ లో పిల్లల ఫిర్యాదులు
మహబూబాద్ జిల్లాలోని బయ్యారంలో ఓ ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న ఓ బుడతడు మ్యాథ్స్ టీచర్ తనను కొడుతున్నాడని, మాస్టర్ కొడుతున్న దెబ్బలను తట్టుకోలేక పోతున్నానని ఏకంగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి మాస్టర్ పై ఫిర్యాదు చేశాడు. అంతకుముందు కర్నూలు జిల్లా పెద్దకడబూరు లోనూ ఇద్దరు స్నేహితుల మధ్య పెన్సిల్ పంచాయతీ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళారు.












Click it and Unblock the Notifications