11 ఏళ్ల పిల్లవాడే.. కొండచిలువకు తన దెబ్బేంటో చూపించాడు
మంగళూరు : కొండచిలువతో పోరాడి ఓ బాలుడు తన ప్రాణాలను దక్కించుకున్న ఘటన కర్ణాటకలోని బంత్వాల్ తాలూకా కొలకేలో మంగళవారం నాడు చోటు చేసుకుంది. అయితే కొండచిలువ సైతం బెదిరిపోయేలా పోరాడిన అతను మొత్తానికి దాని చెర నుంచి తప్పించుకుని సురక్షితంగా బయటపడ్డాడు.
వివరాల్లోకి వెళ్తే.. బంత్వాల్ తాలూకా కొలకేలో వైశాఖ్(11) అనే ఐదో తరగతి బాలుడు ఆదర్శ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుతున్నాడు. స్కూల్ నుంచి వచ్చేప్పుడు తాతయ్య ఇంటికి వెళ్లి రావడం వైశాఖ్ కు అలవాటు. ఇదే క్రమంలో అక్టోబర్ 4న స్కూల్ నుంచి తిరిగొస్తూ.. తాతయ్య ఇంటికి వెళ్లాడు. అనంతరం అక్కడినుంచి ఇంటి బాట పడ్డాడు.

అలా ఇంటికి నడిచొస్తున్న క్రమంలో.. పొదల్లో ఉన్న ఓ కొండచిలువ ఒక్కసారిగా వైశాఖ్ పై దాడి చేసింది. కిందపడ్డ వైశాఖ్ ను మింగేయడానికి ప్రయత్నించగా.. పొదల్లో ఉన్న ఓ రాయిని తీసుకుని కొండచిలువ ముఖం మీద పగిలిపోయేలా కొట్టాడు. దీంతో బాలుడి ప్రతిఘటనకు కొండచిలువ తోక ముడవక తప్పలేదు. అటు తర్వాత హర్షిత అనే బాలిక వైశాఖ్ ను అతని ఇంటికి తీసుకెళ్లగా.. స్వల్ప గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో వైశాఖ్ చికిత్స పొందుతున్నాడు. ఏదేమైనా కొండచిలువను ధైర్యంగా ఎదుర్కొని ప్రాణాలతో బయటపడ్డ వైశాఖ్ ధైర్యాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.












Click it and Unblock the Notifications