11ఏళ్ళ బధిర బాలికపై అమానుష అత్యాచారం
సమాజంలో అత్యాచార ఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాంపూర్ లో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. 11 సంవత్సరాల మూగ, చెవిటి బాలిక పైన అత్యంత అమానవీయంగా అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. రాంపూర్ లో ఉంటున్న 11 సంవత్సరాల బధిర బాలిక కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బధిర బాలికపై అత్యాచారం... పోక్సో కేసు నమోదు
ఇక బాలిక కోసం కుటుంబ సభ్యులు వెతుకుతున్న క్రమంలో బాలిక పొలాలలో తీవ్ర గాయాలతో నగ్నంగా కనిపించింది. దీంతో వెంటనే అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానిక ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. బాలికపై అత్యాచారం జరిగిందన్న సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆపై నిందితుడిని పట్టుకున్నారు.

పొలాల్లోకి తీసుకెళ్ళి అత్యాచారం
ఇక విచారణలో భాగంగా సంఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను పరిశీలించిన పోలీసులు 24 సంవత్సరాల దాన్ సింగ్ అనే వ్యక్తి బాలికకు మాయమాటలు చెప్పి పొలాల్లోకి తీసుకు వెళ్లినట్లు గుర్తించారు. దీంతో నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించిన పోలీసుల పైన దాన్ సింగ్ కాల్పులు జరిపారు. ఎదురు కాల్పులలో నిందితుడి కాలికి గాయం కావడంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అత్యంత ఘోరంగా బాలికపై అత్యాచారం
ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారికి సంబంధించి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కీలక విషయాలు వెల్లడించారు. బాలిక పైన ఒకరి కంటే ఎక్కువమంది అత్యాచారం చేసినట్టు తెలుస్తుందని పేర్కొన్నారు. బాలిక ముఖం పైన బలమైన గాయాలు ఉన్నాయని తెలిపారు. ఇక బాలిక ప్రైవేట్ భాగాల పైన కూడా అనేక గాయాలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు చూసిన అత్యంత ఘోరమైన లైంగిక నేరాలలో ఇది ఒకటని బాలికను పరీక్షించిన వైద్యులు వెల్లడించారు.
బాలికను తీవ్రంగా గాయపరిచిన కీచకులు
ఇంత అమానుషంగా మాట్లాడలేని, వినికిడి శక్తి లేని బాలిక పైన అత్యాచారానికి పాల్పడిన వారు, ఆమెను తీవ్రంగా గాయపరిచారు. చిన్న పిల్ల అన్న కనికరం లేకుండా దారుణానికి పాల్పడ్డారు. వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications