ఆశీర్వదించండి అంటూనే బిఎస్పీ నేత కాల్చివేత
వారణాసి: మీ ఆశీర్వాదంతో మేము చల్లగా ఉండాలని అనుకుంటున్నామని చెప్పిన ఇద్దరు వ్యక్తులు ఓ రాజకీయ నాయకుడిని అతి దారుణంగా కాల్చి హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో జరిగింది.
ఉత్తరప్రదేశ్ కు చెందిన బహుజన్ సమాజ్ వాదీ పార్టీ నేత రామ్ బీహారీ చౌబీ వారణాసిలోని శ్రీకాంత్ పూర్ లో నివాసం ఉంటున్నారు. శుక్రవారం ఇద్దరు వ్యక్తులు రామ్ బీహారీ చౌబీ ఇంటి దగ్గరకు వెళ్లారు. అక్కడ ఉన్న ఆయన సిబ్బంది మీకు ఏమి కావాలని ఇద్దరినీ ప్రశ్నించారు.
రామ్ జీ ఆశీర్వాదం కావాలని చెప్పారు. రామ్ బీహారీ చౌబీ పంపించమని చెప్పడంతో ఇద్దరు ఆయన దగ్గరకు వెళ్లారు. తరువాత అతి సమీపం నుంచి రామ్ బీహారీ చౌబీ మీద కాల్పులు జరిపి అక్కడి నుంచి తప్పించుకుని పరారైనారు.

తీవ్ర రక్తస్రావం అయిన రామ్ బీహారీ చౌబీని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స విఫలమై ఆయన మరణించారని పోలీసులు తెలిపారు. 2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేత సుశీల్ సింగ్ చేతిలో రామ్ బీహారీ చౌబీ ఓటమి పాలయ్యారు.
స్థానిక రాజకీయాలలో రామ్ బీహారీ చౌబీ చురుకుగా పాల్గోంటున్నాడు. ఈయనకు మాఫియా డాన్ బ్రజేష్ సింగ్ తో సన్నిహిత సంబంధాలున్నాయని పోలీసు అధికారులు అంటున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దం అవుతున్న సమయంలో హత్యకు గురైనారు.












Click it and Unblock the Notifications