వేతన జీవులకు ఊరటే!: భారీగా పెరగనున్న ఆదాయ పరిమితి
Recommended Video

న్యూఢిల్లీ: వేతన జీవులకు ఈ ఏడాది బడ్జెట్లో గొప్ప ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుత ఎన్‌డీఏ ప్రభుత్వానికి ఇది చివరి సాధారణ బడ్జెట్ కానుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపును, పన్ను శ్లాబులను పెంచే దిశగా ఆర్థిక శాఖ యోచిస్తోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ఈ బడ్జెట్‌లో ఆదాయ పన్ను మినహాయింపును 2.5లక్షల నుంచి 3లక్షలకు లేదా 5లక్షల వరకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రిటైల్ ద్రవ్యోల్బణం ప్రభావం పడుతున్న వేతన జీవుల కోసం ఈ చర్యలు చేపట్టే అవకాశం కనిపిస్తోంది. గత బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పన్ను శ్లాబులలో మార్పులు చేయనప్పటికీ.. తక్కువ పన్ను చెల్లింపుదార్లకు ఊరటనిచ్చారు. రూ.2.5-5 లక్షల మధ్య వార్షికాదాయం ఉన్న వారికి పన్ను రేటును 10 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు.

రూ.10-20 లక్షల ఆదాయ వర్గాల కోసం..: వచ్చే నెల 1న ప్రకటించే తదుపరి బడ్జెట్లో రూ.5-10 లక్షల ఆదాయ వర్గాలకు 10%; రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు 20%; రూ.20 లక్షల పైబడిన వారికి 30 శాతంగా పన్ను రేట్లను విధించొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రూ.10-20 లక్షల ఆదాయ వర్గాలకు ఎటువంటి శ్లాబు లేదు. 'ద్రవ్యోల్బణం కారణంగా జీవన వ్యయాలు పెరిగిన నేపథ్యంలో ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని; ఇతర ఆదాయ శ్లాబులను పెంచాల్సిన అవసరం ఉంది. ఇతర దేశాల్లో గరిష్ఠ పన్ను రేటుకు సంబంధించిన ఆదాయం చాలా ఎక్కువగా ఉందన్న విషయాన్ని గమనించాల'ని పరిశ్రమ సంఘం సీఐఐ తన ముందస్తు బడ్జెట్ మెమొరాండంలో పేర్కొంది.
ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్ 80సీ కింద ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచనున్నట్లు భావిస్తున్నారు. అయితే, ఇది 80సీలోని ఒకట్రెండు పన్ను ఆదా అంశాలకే పరిమితమయ్యే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సెక్షన్ 80సీ పరిమితిని రూ.2 లక్షలకు పెంచితే అదనంగా ఆదా అయ్యే మొత్తం రూ.2,575 (10%), రూ.10,300 (20%), రూ.15,450(30%)గా ఉండనుంది. కాగా, ప్రస్తుతం సెక్షన్ 80సీ కింద జీవితబీమా, ఈక్విటీ అనుసంధాన పొదుపు పథకాలు(ఈఎల్‌ఎస్‌ఎస్), ఐదేళ్ల తపాలా టైమ్ డిపాజిట్లు, వయోవృద్ధుల పొదుపు పథకం(ఎస్‌సీఎస్‌ఎస్), సుకన్య సమృద్ధి ఖాతా, ప్రజాభవిష్యనిధి(పీపీఎఫ్), జాతీయ పొదుపు పత్రం(ఎన్‌ఎస్‌సీ), ఐదేళ్ల పన్ను ఆదా బ్యాంకు డిపాజిట్లు, ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) తదితర పెట్టుబడులు, వ్యయాలపై స్థూల మొత్తం ఆదాయంలో ఏటా రూ.1.5 లక్షల దాకా డిడక్షన్‌కు అవకాశం ఉంది.
ఎవరైనా రూ.1.5 లక్షల్ని ఇందులో ఏదైనా ఒక పథకంలోగానీ, వేర్వేరుగాగానీ పెట్టవచ్చు. బోధన రుసుములు, గృహ రుణాల చెల్లింపులు వంటి వ్యయాల ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు. చివరిసారిగా 2014-15లో ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షలకు పెంచారు.












Click it and Unblock the Notifications