పార్లమెంట్ సమావేశాలు: 31 నుంచి ప్రారంభం, రెండు దశల్లో బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం(జనవరి 31) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021-22ను ప్రవేశపెట్టనున్నారు.
అనంతరం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనున్నాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. ఈ సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేర్వేరు నేతలతో సమావేశమవుతారు. ఉభయ సభల్లో సమావేశాలపై చర్చిస్తారు.

ఒకవైపు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించగా.. మరోవైపు పార్లమెంట్ వేదికగా పలు సమస్యలపై ప్రశ్నలు సంధించి కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమవుతున్నాయి. రైతుల సమస్యలు, స్పైవేర్, చైనా సమస్య, ఎయిరిండియా విక్రయం, కరోనా బాధితులకు రిలీఫ్ ప్యాకేజీ వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని భావిస్తున్నాయి.
పార్లమెంటులో బడ్జెట్ సమావేశాలు జరగనున్న తరుణంలోనే.. దేశంలోని కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరుగనుండటం ఆసక్తికరంగా మారింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో ఫిబ్రవరి-మార్చి నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ కేటాయింపులు ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో అన్ని రాజకీయా పార్టీలు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. కాగా, మెజార్టీ ఓపీనియన్ పోల్స్ ప్రకారం.. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో మరోసారి బీజేపీనే అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో మాత్రం అధికార కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉండనుందని పేర్కొంటున్నాయి. అయితే, పంజాబ్ రాష్ట్రంలో హంగ్ ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.












Click it and Unblock the Notifications