మళ్లీ మేమే- నిర్మల సీతారామన్ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్
Budget 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో.. కేంద్రంలో అధికారం ఉన్న బీజేపీ-ఎన్డీఏ సంకీర్ణ కూటమి ప్రభుత్వం పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రతిపాదనలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రతిపాదనలను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ సభలో ప్రవేశపెట్టారు. అందులో పొందుపరిచిన అంశాలను చదివి వినిపించారు.
ఈ మధ్యంతర బడ్జెట్ ప్రసంగాన్ని నిర్మల సీతారామన్.. గంటలోపే ముగించారు. బడ్జెట్ ప్రసంగంలో ఎలాంటి మెరుపులూ మెరిపించలేదు. గతం కంటే భిన్నంగా సాగిందామె ప్రసంగం. ఇదివరకట్లా ఎలాంటి సూక్తులనూ వినిపించలేదు. హితబోధనలూ చేయలేదు. చెప్పదలచుకున్నది సూటిగా చెప్పేశారు.

మధ్యంతర, ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కావడం వల్లే పెద్దగా భారీ కేటాయింపులు చోటు చేసుకోలేదు. అలాగే పన్నుల వడ్డనలూ లేవు. పన్నుల శ్లాబుల్లోనూ ఎలాంటి మార్పులకూ పూనుకోలేదు కేంద్ర ప్రభుత్వం. ఎన్నికలు ముగిసిన అనంతరం కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది.
ఈ ఏడాది జులైలో మళ్లీ తమ ప్రభుత్వమే పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుందనే ధీమాను నిర్మల సీతారామన్ వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి ఘన విజయం సాధిస్తుందనే విషయాన్ని పరోక్షంగా వెల్లడించారు. దేశంలో అన్ని వర్గాల సంక్షేమానికి తాము కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు.
వికసిత భారత్‌కు సంపూర్ణమైన రోడ్ మ్యాప్‌ను ఆ పూర్తిస్థాయి బడ్జెట్‌లో పొందుపరుస్తామని నిర్మల సీతారామన్ తేల్చి చెప్పారు. పేదలు, అన్నదాతలు, మహిళలు, యువత భవిష్యత్తు, వారి పురోగమనమే దేశానికి బలమైన పునాదులుగా అభివర్ణించారు. రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్‌ను 11.1 శాతానికి పెంచినట్లు వెల్లడించారు. ఆమె ప్రసంగం ముగిసిన వెంటనే సభ శుక్రవారానికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications