Union Budget 2026:: ఆ అధికారులకు ఇప్పుడంతా 'జైలు' జీవితమే..!
Union Budget 2026: దేశ ఆదాయ-వ్యయాల లెక్కలను సరిచూస్తూనే, భవిష్యత్ ప్రగతికి బాటలు వేసే వ్యూహాత్మక పత్రం 'కేంద్ర బడ్జెట్'. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026 కోసం కసరత్తు ముమ్మరమైంది. దేశ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయించే ఈ కీలక పత్రం తయారీ వెనుక ఎంతో కఠినమైన రహస్య ప్రక్రియ దాగి ఉంటుంది. బడ్జెట్ రూపొందించే అధికారులు, సిబ్బంది కొన్ని రోజుల పాటు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఓ రకమైన స్వచ్ఛంద ఖైదులో ఉండాల్సి వస్తుందని తెలుసా!
బయటి ప్రపంచంతో కట్.. నార్త్ బ్లాకే వారి ప్రపంచం!
కేంద్ర బడ్జెట్ తయారీలో పాల్గొనే బృందం అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉంటుంది. బడ్జెట్ పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు వీరు తమ ఇళ్లకు వెళ్లడానికి వీలుండదు. బడ్జెట్ రూపకల్పన సమయంలో అధికారులకు మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ సదుపాయం ఉండదు. వారు తమ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడలేరు. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో బడ్జెట్ ప్రింటింగ్, ప్రూఫ్ రీడింగ్, అనువాద పనులు జరుగుతాయి. పనులు పూర్తయ్యే వరకు ఆ ప్రాంతం ఒక కోటలా మారుతుంది. ఎవరికైనా అనారోగ్యం చేస్తే బయటి డాక్టర్ల వద్దకు తీసుకెళ్లకూడదనే ఉద్దేశంతో, అక్కడే ఒక మెడికల్ టీమ్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. వారికి వచ్చే ఆహారాన్ని కూడా పరీక్షించిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు.

బడ్జెట్ లీక్ చరిత్ర.. ఆసక్తికరమైన ఘటనలు
బడ్జెట్ రహస్యాలను కాపాడటం వెనుక బలమైన కారణాలు ఉన్నాయి. గతంలో దేశంలో రెండు సార్లు బడ్జెట్ లీక్ అయింది.
మొదటి ఘటన (1947-48): స్వతంత్ర భారత తొలి బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఆర్.కె. షణ్ముఖం శెట్టి నాటి బ్రిటన్ ఆర్థిక మంత్రి హ్యూ డాల్టన్ సలహా కోరారు. అయితే డాల్టన్ ఈ విషయాలను ముందే మీడియాకు చెప్పేయడంతో బడ్జెట్ లీక్ అయ్యింది. దీనివల్ల డాల్టన్ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
రెండో ఘటన (1950): జాన్ మథాయ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రపతి భవన్ ప్రెస్ నుంచి బడ్జెట్ వివరాలు లీక్ అయ్యాయి. విపక్షాలు దీనిపై తీవ్ర నిరసన తెలపడంతో జాన్ మథాయ్ రాజీనామా చేశారు. ఆ తర్వాతే బడ్జెట్ ప్రింటింగ్‌ను నార్త్ బ్లాక్‌కు మార్చారు.
స్నిఫర్ డాగ్స్ నిఘా..
బడ్జెట్ పత్రాల భద్రతను నిర్ధారించడానికి బాంబు స్క్వాడ్, స్నిఫర్ డాగ్స్ (నిఘా కుక్కలు) సహాయం కూడా తీసుకుంటారు. ప్రింటింగ్ పూర్తయిన తర్వాత ఆ పత్రాలలో ఎటువంటి అనుమానాస్పద వాసనలు లేదా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకోవడానికి కుక్కలచే తనిఖీ చేయిస్తారు. సీఐఎస్‌ఎఫ్ (CISF), ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు నిరంతరం నిఘా ఉంచుతారు.
బడ్జెట్ 2026పై అంచనాలు
ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. గత బడ్జెట్‌లో కొత్త పన్ను విధానాన్ని ఆకర్షణీయంగా మార్చినందున, ఈసారి ఆదాయపు పన్నులో పెద్దగా ఊరట ఉండకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఏది ఏమైనా,ఆ 'రహస్య గది'లో సిద్ధమవుతున్న అసలు విషయాలు ఫిబ్రవరి 1నే వెలుగులోకి వస్తాయి.












Click it and Unblock the Notifications