CAA: అమిత్ షా, రాజ్ నాథ్ కార్ల నంబర్ ప్లేట్లపై సీఏఏ అక్షరాలు- వైరల్..!
2019 ఎన్నికల సమయంలో కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను ఐదేళ్లుగా అమలు చేసే పరిస్దితి లేకపోవడంతో పక్కనబెట్టేశారు. కేవలం అసోంలో మాత్రమే దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసిన కేంద్రం.. మిగతా రాష్ట్రాల్లో వచ్చిన వ్యతిరేకత నేపథ్యంలో మూలన పడేసింది. కానీ ఇప్పుడు మరోసారి ఎన్నికల వేళ దీని దుమ్ముదులుపుతోంది. ఎన్నికల షెడ్యూల్ వచ్చే లోపే సీఏఏ అమలు చేసి తీరుతామని కేంద్రమంత్రులు వరుస ప్రకటనలు చేస్తున్నారు.
ఇదే క్రమంలో సీఏఏ అమలుపై ప్రకటనలు చేస్తున్న హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తమ కార్ల నంబర్ ప్లేట్లపై సీఏఏ అక్షరాలు ముద్రించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ కార్లపై అనూహ్యంగా సీఏఏ అక్షరాలు కనిపించడంతో దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

సీఏఏ అమలుపై దేశంలోని పలు ప్రాంతాల్లో, ముఖ్యంగా మైనార్టీ వర్గాల్లో అభద్రతాభావం నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఎన్నికల్లో దాని లబ్దికి ప్రయత్నిస్తుందన్న అంచనాలున్నాయి. ప్రతీసారి ఎన్నికల్లో పాకిస్తాన్ లేదా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చి లబ్ది పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న విపక్షాల ఆరోపణల నేపథ్యంలో ఈసారి సీఏఏ అమలుకు ఎన్డీయే సర్కార్ చేస్తున్న ప్రయత్నాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీంతో కేంద్రం త్వరలో చేసే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications